బదిలీలు అగమ్యగోచరం!
అగ్రికల్చర్ అధికారుల ఇబ్బందులు
చివరి క్షణం వరకు ప్రకటించని ఖాళీలు?
కౌన్సెలింగ్ బహిష్కరించిన ఏవోలు
మే 31న ముగిసిన బదిలీల గడువు
మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల బదిలీల కోసం ప్రభుత్వం నెల రోజులు గడివిచ్చినా, వ్యవసాయ శాఖలో జిల్లా వ్యవసాయ అధికారి, డివిజన్ వ్యవసాధికారి, మండల వ్యవసాయ అధికారుల బదిలీలు నోచుకోలేదు. నెల రోజుల గడువు పూర్తవుతుందనగా, చివరి క్షణంలో బదిలీల ప్రక్రియ చేపట్టినప్పటికీ, బదిలీల కౌన్సిలింగ్ కు అవసరమైన ఖాళీలను ప్రకటించకపోవడంతో సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో వ్యవసాయ శాఖలో డిఏఓ, ఏడీఏ, ఏవో బదిలీలు నిలిచిపోయాయి.
తెలంగాణ వ్యాప్తంగా మల్టీ జోన్ 1 లో నాలుగేళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న అధికారులు 40 శాతం మంది సుమారు 160 కి పైగా ఉండగా, మల్టీ జోన్ 2లో 140 మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గత నెల మొత్తం బదిలీల కౌన్సిలింగ్‌కు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ ముగించారు. కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే అందులో డీఏవో, ఏడీఏ, ఏవోలు మాత్రమే బదిలీలకు నోచుకోలేదు.
బదిలీల ప్రక్రియ మే 31న ముగిసిపోతుందనగా, హడావిడిగా 30వ తేదీ శనివారం రాత్రి అధికారుల బదిలీలకు కౌన్సిలింగ్ చేయడానికి ఉన్నతాధికారులు పిలిచారు. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు హాజరు కాగా, అప్పటివరకు కూడా ఖాళీల వివరాలను ప్రకటించకపోవడం, జిల్లా కేంద్రంతో పాటు హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఇచ్చే స్థానాలను బ్లాక్ చేశారని, అనుకూలమైన వారికి వాటిని కేటాయించేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ, అధికారుల సంఘ బాధ్యులు పలు జిల్లాలో బదిలీల ప్రక్రియను బహిష్కరించారు.
దీన్ని సాకుగా చేసుకొని ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియను నిలిపివేశారని, ఫలితంగా ప్రభుత్వం మళ్లీ బదిలీ లపై నిషేధం విధించడంతో, తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వ్యవసాయ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. మల్టిజో న్ 1, మల్టీజోన్ 2లో కలిపి 300 మందికి పైగా మండల వ్యవసాయ అధికారులు (ఎంఏఓ), డీడీఏ, డివిజన్ వ్యవసాయ అధికారులు(ఏడీఏ) మళ్లీ పూర్వస్థానంలోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు.
ఐదేళ్ల నుంచి ఒకే చోట ఏవోల విధులు
కొన్ని మండలాల్లో ఏవోలు ఐదు నుంచి ఎనిమిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని, అందులో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, అలాంటివారికి తాము కోరుకున్న ప్రదేశాలకు బదిలీ కావడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, బదిలీలకు తాము కోరుకోవడానికి ప్లేసులు చూపకుండా, చివరి శిక్షణం వరకు ఖాళీల లిస్టు ప్రదర్శించకుండా, చాలా ప్లేసులు బ్లాక్ చేయడం వల్ల బదిలీల ప్రక్రియకు విఘాతం కలిగించారని వ్యవసాయ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బదిలీల ప్రక్రియ కోసం సంఘాల బాధ్యులను జిల్లా అధికారులు పిలిచినప్పటికీ, ఖాళీల జాబితా చూపకపోవడం వల్ల తాము బదిలీలకు ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఏవోలు చెబుతున్నారు. ప్రభుత్వం బదిలీలకు ఇచ్చిన నెల రోజుల గడువు ఉత్తరువు ప్రకారం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) లను బదిలీ చేసిన అధికారులు, డీఏవో, ఏడీఏ, ఏఓ లను బదిలీ చేయడానికి సకాలంలోచర్యలు చేపట్టలేదని, ఉత్తరువు గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు హడావుడి చేయడం వల్ల బదిలీలకు ఆటంకంగా మారిందని చెబుతున్నారు.
కేవలం పదోన్నతులు కల్పించిన వారికి మాత్రమే బదిలీల ప్రక్రియ నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం బదిలీల ఉత్తరువు గడువు ముగిసిన తర్వాత మరో ఆరు నెలల పాటు ఏలాంటి మెసులుబాట్లకు అవకాశం లేదని ప్రకటించింది. దీనితో వ్యవసాయ శాఖ అధికారులు ఇక తమ బదిలీల ప్రక్రియ మరో ఆరు నెలల పాటు నిలిచిపోయిందని, ఇంకెంతకాలం పాత ప్లేస్ లోనే ఏళ్ల తరబడి పనిచేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 40 శాతం అధి కారుల బదిలీలకు అవసరమైన ఖాళీలను ప్రదర్శించాలని, జీవో 37 ప్రకారం ఒకే చోట ఆరేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న వారికి రిటైన్షన్ లేకుండా ఆఫీస్ బేరర్లను కూడా బది లీ తప్పనిసరి చేయాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా బదిలీల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ప్రత్యేకంగా బదిలీల కోసం వ్యవసాయ శాఖకు సడలింపు అనుమతి ఇవ్వాలని అధికారుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.






