ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యం
సీపీ బి.సుమతి
‘మీ సురక్ష సహచరి’ కార్యక్రమానికి విశేష స్పందన
నాగోల్, జూలై 14 (విజయక్రాంతి): మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది అని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అన్నారు. ఈ సందర్భంగా నాగోల్ శుభం కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మీ సురక్ష సహచరి కార్యక్రమాన్ని మంగళవారం సీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతూ చట్టాలపై అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో భద్రమైన సురక్షితమైన సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అని సిపి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, ఎంఈ పిఎంఎ,ఎస్ ఈ ఆర్ పి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం సహచరిను మంగళవారం నాగోల్లోని శుభమ్ కన్వెన్షన్లో నాగోల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎల్.బి.నగర్, ఉప్పల్ జోన్లకు చెందిన సుమారు మూడు వేల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సుమతి మాట్లాడుతూ.... మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. కాలనీలు, బస్తీల స్థాయిలో మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేస్తే నేరాలను సకాలంలో గుర్తించడం, మహిళలు, పిల్లల భద్రతను మరింత పటిష్ఠం చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
‘మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితం.. కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితం‘ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలకు చట్టపరమైన హక్కులు, వ్యక్తిగత భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల ప్రమాదాలు, అత్యవసర సేవలు, పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలు, కమ్యూనిటీ పోలీసింగ్, భారోసా సెంటర్లు, షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
అలాగే కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం, దర్యాప్తు సేవల గురించి వివరించారు. ఎం ఈ పిఎంఏ అదనపు మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. యాదగిరిరావు మాట్లాడుతూ, ప్రతి నెల జరిగే స్వయం సహాయక మహిళా సంఘాల సమావేశాల్లో భద్రత అంశాలను చర్చించి, ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను మరింత మంది మహిళలకు చేరవేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. అనురాధ, డీసీపీ ఎల్.బి.నగర్ జోన్, కె. సురేష్ కుమార్, డీసీపీ ఉప్పల్ జోన్, చి. శ్రీధర్, డీసీపీ మల్కాజిగిరి జోన్, కె. రాహుల్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-1, టి. ఉషారాణి, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్, ఎ. లక్ష్మి, డీసీపీ ఎస్‌ఓటీ, ఇతర అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్వోలు, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, ఎం ఈ పిఎంఎ, ఎస్ ఈ ఆర్ పి అధికారులు పాల్గొన్నారు. ‘సహచరి‘ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన మహిళలు తమ ప్రాంతాల్లో భద్రతపై అవగాహన పెంచుతూ, నేరాల నియంత్రణలో పోలీసులకు వారధిగా నిలవనున్నారని అధికారులు తెలిపారు.






