5 September, 2026 | 7:04 AM

మన ఇంటర్ విద్య దేశంలోనే నం.1

05-09-2026 | 05:25am

ఇంటర్ విద్యను విలీనం చేయబోమని అసెంబ్లీలో ప్రకటన చేయాలి

విద్యాకమిషన్ మూడేళ్లు టైమ్ వేస్ట్ చేసింది

సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ సమావేశంలో టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

విలీనం ప్రతిపాదనను విరమించుకోకుంటే ఉద్యమం

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మన ఇంటర్మీడియట్ విద్య దేశంలోనే నెంబర్ వన్ అని, సీఎం రేవంత్ రెడ్డివన్నీ తుగ్లక్ నిర్ణయాలేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS Chief Kalvakuntla Kavitha) విమర్శించారు.

ఇంటర్ విద్యను విలీనం చేయబోమని అసెంబ్లీలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డా.పి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని మీడి యా అకాడమీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ సైరన్’ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

దేశంలోనే మన ఇంటర్ విద్యకు ఎవ రూ సాటిరారని, మన విద్యార్థులే ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ విద్య విలీనం, ఐటీఐ, పాలిటెక్నిక్ తొలగింపు లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు మేధావులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్య వేస్ట్ అని ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. ఈ ఏడాది మాత్రమే ఇంటర్మీడియేట్ ఉంటుందని వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్య ఉండకపోవచ్చని సీఎం చెబుతున్నారని గుర్తు చేశారు.

వైట్ కాలర్ జాబ్‌లు వదిలేసి బ్లూ కాలర్ జాబ్ (లేబర్ ఉద్యోగాలు)లు వెతుక్కోవాలని సీఎం సూచించటం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలిచ్చే వ్యాపారుల ను తయారు చేసే లక్ష్యం దిశగా ప్రభుత్వం పని చేయాలన్నారు. మన ఇంటర్మీడియేట్ బోర్డు దేశంలోనే నంబర్ వన్ గా ఉందని చెప్పారు. ఇలాంటి సంస్థను మరింత పటి ష్టం చేయాలే తప్ప తీసేయాలనుకోవడం  సరికాదన్నారు. 

ఇంటర్ విద్య లేదంటే విద్యార్థుల తల్లితండ్రులే ఈ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు. విద్యా కమిషన్ పేరుతో ఈ ముఖ్యమంత్రి మూడే ళ్లు వృథా చేశారని మండిపడ్డారు. విద్యా కమిషన్ చేసిన సూచనల్లో టెస్టెడ్, ట్రెయిన్డ్, ఫెయిల్డ్ సూచనలున్నాయన్నారు. వాటిని కూడా సీఎం పట్టించుకోలేదని చెప్పారు. అలాంటప్పుడు కమిషన్ పేరుతో ఎందుకు సమయం వృథా చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ కే.కేశవరావు కమిషన్ పేరుతో మరింత సమయం వృథా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య, వైద్యం అందిచాలన్నది తమ సంకల్పమని చెప్పారు.

రాష్ట్రానికి ఏటా వస్తున్న రూ. 2 లక్షల కోట్ల ఆదాయంలో లక్ష కోట్లు విద్య, వైద్యం కోసం కేటాయిస్తే ఇది సాధ్యమేనని చెప్పారు. ఇంటర్ విద్యను ముట్టుకుంటే రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగడం అనుమానమే అని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.పి.మధుసూదన్ రెడ్డి(Intermediate Education JAC Chairman Madhusudan Reddy) హెచ్చరించారు. కాశ్మీర్ ఎన్‌ఐటీలో  కూడా 50 శాతం మం ది విద్యార్థులు తెలుగు వారే ఉండటానికి ఇక్కడి ఇంటర్ విద్యా విధానమే కారణమని ఆయన చెప్పారు. 

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనుకోవడం సహేతుకంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖలో ఇచ్చిన సలహాలే జగన్మోహన్ రెడ్డిని ముంచాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్, గెస్ట్ ఫ్యాకల్టీల సంఘం నాయకులు కృష్ణ కుమార్, కనకచంద్రం, యాకుబ్‌పాష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు