5 September, 2026 | 7:13 AM

9 రోజులైనా సజీవం

05-09-2026 | 05:25am

సొరంగంలో హరే కృష్ణ జపం

ప్రాణాలతో ఇద్దరు కార్మికులు

నేపాల్‌లో 1,295కి చేరిన మృతుల సంఖ్య

ఇంకా 5,000 మంది గల్లంతు

కాఠ్మాండు/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: నేపాల్‌(Nepal)లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని తొమ్మిది రోజులైనా.. క్షణక్షణం మృత్యువుతో పోరాడుతూ.. ఇద్దరు కార్మికులు సజీవంగా ఉన్నారు. వీరిని అత్యవసర బృందాలు రక్షించారు. వీరిలో ఒకరు తొమ్మిది రోజులుగా ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించానని, అందుకే బతికానని పేర్కొన్నాడు. అయితే నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,295కి చేరింది. ఇంకా 5,000 మంది గల్లంతయ్యారు.

వీరిలో 600 మంది పిల్లలు, 22 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. 275 మంది భారతీయుల ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న సొరంగంలో తొమ్మిది రోజుల పాటు చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను అధికారులు సజీవంగా రక్షించారు. ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాల నుంచి 13,093 మందిని కాపాడారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్యూ కొనసాగుతోంది. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు చరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన ఈ ఆకస్మిక వరదలు, ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు నేపాల్‌లోని ఎనిమిది జిల్లాల నుంచి 1,293 మృతదేహాలను వెలికితీశారు. వీటిలో చిత్వాన్ జిల్లాలో 359, నవల్పరాసి తూర్పులో 221, నవల్పరాసి పడమరలో 212, నువాకోట్లో 186 మృతదేహాలున్నాయి. రసువాలో 140, గోర్ఖాలా 72, ధాడింగ్‌లో 65, తనాహులో 38 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం కాఠ్మాండు లోని రెండు వేర్వేరు ఆసుపత్రులలో వరద బాధితులు ఇద్దరు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 1,295కి చేరింది. 5వేల మంది గల్లంతయ్యారు.   

చిక్కుకున్న వారికోసం భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు, సహాయక చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాల నుంచి 13,093 మందిని రక్షించారు. భారతదేశం నుంచి 21.5 టన్నుల సహాయ సామగ్రితో వచ్చిన ఆరు, ఏడో సహాయక విమానాలు గురువారం రాత్రి కాఠ్మండుకు చేరుకున్నాయి. మరోవైపు టిబెట్ గిరోంగ్ కౌంటీలో గత వారం సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 31కి పెరిగింది. 

సొరంగంలో హరే కృష్ణ జపం 

సొరంగం నుంచి సజీవంగా రక్షించబడిన ఇద్దరు వ్యక్తులను ప్రాజెక్ట్ మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్(45), ఫోర్మెన్ సంజయ్ సాహ్(30)గా గుర్తించినట్లు నేపాల్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది. మహర్జన్‌ను కాఠ్మాండులోని ఛౌనిలో ఉన్న నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.

మరోవైపు, సాహ్ నువాకోట్ లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. మధేష్ రాష్ట్రంలోని సప్తరి జిల్లాకు చెందిన సాహ్, సొరంగంలో చిక్కుకున్నప్పుడు.. తొమ్మిది రోజులుగా ‘హరే కృష్ణ’ మంత్రాన్ని జపిస్తున్నానని భద్రతా సిబ్బందికి తెలిపారు. తన భర్తకు ‘రెండో జీవితం‘ లభించిందని మహర్జన్ భార్య హీరాశోభ అన్నారు. 

275 మంది భారతీయుల ఆచూకీ లేదు: ఎంఈఏ 

నేపాల్- సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా 275 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియలేదు. అదే సమయంలో 166 మంది భారతీయులను అత్యవసర బృందాలు రక్షించాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం తెలిపింది. చైనా నుంచి 1,907 మంది భారత పౌరులు సురక్షితంగా నేపాల్‌లోకి ప్రవేశించారని వెల్లడించింది. నేపాల్‌కు ఇప్పటివరకు భారత్ సుమారు 95 టన్నుల సహాయక సామగ్రిని, 54 మంది సిబ్బందిని పంపిందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు