02-02-2026 01:02:17 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన ర్యాలీలు, రాస్తారోకోలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనాలు
అడ్డుకున్న పోలీసులు, అక్కడక్కడ స్వల్ప ఉద్రుక్తత
కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గులాబీ దండు కదం తొక్కారు. ఫోన్ టాపింగ్ నెపంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ అధికారులు జారీ చేసిన నోటీసుల వ్యవహారాన్ని తప్పుపడుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపుతో ఆదివా రం భారీ సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఖమ్మంలో బిఆర్‌ఎస్ బైక్ ర్యాలీ, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి సిద్ధపడ్డారు. అనుకోని ఈ పరిణామానికి కంగుతిన్న పోలీసులు అడ్డుకోబోయారు.
ఈ ఘటన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉత్పన్నం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు, వారితోపాటు వన్టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని టిఆర్‌ఎస్ శ్రేణుల చర్యను అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు బిఆర్‌ఎస్ శ్రేణులకు వాగ్వాదం చోటుచేసుకుని కొంత ఉద్రుక్త వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు, టిఆర్‌ఎస్ నాయకులు చిత్తూరు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో....
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్ యార్డు నుంచి నిరసన ద్విచక్ర ర్యాలీని నిర్వహించారు. నిరసన ర్యాలీ గణేష్ టెంపుల్ సూపర్ బజార్, రైల్వే స్టేషన్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, జీవి మాల్ విద్యానగర్ కాలనీ మీదుగా చుంచుపల్లి పాన్ మహల్ వరకు సాగింది. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకొంది.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణుల పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయంటూ, ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను విచారణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సాధించిన ఫలితాలను మున్సిపాలిటీలోనూ బంగపాటు తప్పదన్న భయంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారని విమర్శించారు. మణుగూరులో జిల్లా అధ్యక్షుడు మాజీ వెబ్ రేగాకాంత్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ పార్టీ అధినేత పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. నల్ల జెండాలు బ్యాడ్జీలు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సెట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందని మండిపడ్డారు. అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రేగా హెచ్చరించారు. జిల్లాలోని అశ్వరావుపేట, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గం గులాబీ శ్రేణుల ఆందోళనలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి పోశం నర్సింహారావు, నాయకులు యాదగిరి గౌడ్, వల్లభనేని రమణ ,కుంట లక్ష్మణ్ బోశెట్టి రవికుమార్ ,జావేద్ భాషా ,మహిళా నాయకులు అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.