02-02-2026 01:00:57 AM
మొయినాబాద్, ఫిబ్రవరి1(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల వేళ మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసిన క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించి, కొత్తగా చేరిన వారికి అభ్యర్థిత్వాలు కట్టబెట్టడంపై సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. బీ-ఫాంల పంపిణీలో ‘ఆర్థిక లావాదేవీలే‘ ప్రాతిపదికగా మారాయని వస్తున్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మొయినాబాద్లో పార్టీ పరిస్థితి ప్రస్తుతం రెండు పడవల ప్రయాణంలా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు పార్టీ ఇన్చార్జ్ వర్గం మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో సామాన్య కార్యకర్త ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నాడు. ఈ విభేదాల వల్ల పార్టీ కేడర్ పూర్తిగా బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది.ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా, ఇప్పుడే వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం స్థానికంగా వ్యక్తం అవుతుంది. సమర్థతను పక్కనపెట్టి, కేవలం డబ్బుకే బీ-ఫాంలు అమ్ముకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిష్టానం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, నిజాయితీ గల కార్యకర్తలు పార్టీకి దూరం కావడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నగారా మోగకముందే మొదలైన ఈ గందరగోళం కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసేలా ఉంది. సీనియర్ల అసంతృప్తిని చల్లార్చకపోతే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.