16 May, 2026 | 2:12 AM

స్వీయ దర్శకత్వంలో.. ఒంటరి తోడేలు కథతో..

16-05-2026 12:00 AM

రామ్ పోతినేని ఇప్పటివరకు నటుడిగానే కాకుండా గీత రచయితగా, గాయకుడిగానూ ప్రతిభ చాటారు. ఇప్పుడు దర్శకుడిగానూ మారబోతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం ‘#RAPO23’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్టు కోసమే రామ్ పోతినేని దర్శకుడిగా మారి, మెగాఫోన్ పట్టారు. ‘రాపో సినిమాటిక్స్’ అనే కొత్త బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమా స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. శుక్రవారం రామ్ పోతినేని పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను సైతం ఇచ్చారు. ఈ చిత్రంలో రామ్ నటిస్తున్న ‘వీర’ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్టైలిష్ పోస్టర్‌ను పంచుకున్నారు.

ఈ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో లెదర్ జాకెట్ ధరించి వెనుక నుంచి కనిపిస్తున్న రామ్ లుక్ డార్క్, ఇంటెన్స్, రగ్గడ్ వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. అతని స్టైలిష్ ‘వీ’ -కట్ హెయిర్ స్టుల్ పాత్రలోని అగ్రెసివ్ యాటిట్యూడ్‌ను తెలియజేస్తోంది. ఈ పోస్టర్‌పై ఉన్న ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ (ఒంటరి తోడేలు కథ) అనే ట్యాగ్‌లైన్ ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో నిండిన పాత్రను సూచిస్తోంది. దర్శకుడిగా రామ్ పోతినేని స్వయంగా రూపొందించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

ఈ ప్రాజెక్టు రామ్ పోతినేని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంతో రామ్ నటుడి నుంచి దర్శకుడిగా మారడం ద్వారా సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, పవన్‌కళ్యాణ్ వంటి స్టార్స్ జాబితాలో చేరుతున్నారు. ఈ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా, ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.