1 April, 2026 | 4:17 PM

కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పోరాటంలో 369 మందిని కాల్చి చంపింది

01-04-2026 03:04 PM
  1. ఏపీ ప్రజలు రాజధాని లేదని చెప్పుకొవడం దురదృష్టకరం
  2. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ
  3. అమరావతి కోసం బీజేపీ చాలాకాలం పోరాడింది
  4. కిషన్‌రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం
  5. కిషన్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లును( Amaravati Bill) లోక్‌సభ బుధవారం ఆమోదించింది. రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మాట్లాడుతూ... సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ విడిపోయిందని తెలిపారు. తెలంగాణ పోరాటంలో 1969లో కాంగ్రెస్ పార్టీ 369 మందిని తుపాకులతో కాచ్చి చంపిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చిచంపారని ధ్వజమెత్తారు. చివరి దశలో కూడా 1200 మంది ఆత్మ బలిదానంతోనే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ..! కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి ఫైర్ 

కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. విభజన తర్వాత పోటీతత్వంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాల్సిఉందని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇప్పటికీ అమరావతిని రాజధాని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉందని వెల్లడించారు. ఏపీ ప్రజలు తమకు రాజధాని లేదని చెప్పుకొవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతి కోసం బీజేపీ చాలాకాలం పోరాడిందని తెలిపారు. తెలంగాణను పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు.  కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు అడ్డుతగిలారు. తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి జరగాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.