12 July, 2026 | 12:00 PM

మంచిర్యాలలో పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్

12-07-2026 11:28 AM

* 300 మంది పోలీసులతో అర్ధరాత్రి ఎన్టీఆర్ నగర్‌లో విస్తృత సోదాలు

* పత్రాలు లేని 166 బైక్‌లు, ఐదు ఆటోలు, తల్వార్ స్వాధీనం

* నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం

* సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో అర్ధరాత్రి ఎన్టీఆర్ నగర్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు. యువత మత్తుకు బానిసలవుతున్నారని, ఇళ్లలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సుమారు 300 మంది పోలీసులతో కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 20 వేల విలువైన అక్రమ మద్యం నిల్వలు, సరైన పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలతో పాటు ఒక తల్వార్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో కేక్ కట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులకు, అలాగే మరో 10 మంది పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నగర్ ప్రజలు మహానాయకుడు ఎన్టీఆర్ పేరుకు తగ్గట్టుగా మంచి ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. యువత రోడ్లపై అసాంఘికంగా ప్రవర్తించడాన్ని, ఇతరులకు ఇబ్బంది కలిగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.

యువతను సరైన మార్గంలో నడిపించడమే పోలీసుల ప్రధాన ఉద్దేశ్యమని, అవసరమైతే పోలీసు శాఖ తరపున శిక్షణ, మార్గదర్శకత్వం ఇస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ సమస్యలు పరిష్కరిస్తామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఎన్టీఆర్ నగర్ నుంచి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ సంస్థల్లో పనిచేసే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఆపరేషన్‌లో మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీలు ఆర్. ప్రకాష్ (మంచిర్యాల), వెంకటేశ్వర్లు (జైపూర్), కిరణ్ కుమార్ (బెల్లంపల్లి), మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, ఇతర సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.