31 July, 2026 | 2:25 AM

ఈ2౦తో ఇంజిన్లు సురక్షితమే!

31-07-2026 01:34 AM

సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం

లోక్‌సభ వేదికగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై ౩౦: వాహనాలకు ఇంధనంగా ఈ౨౦ పెట్రోల్ వినియోగిస్తే ౨% ౬% మేర మైలేజీ తగ్గుతుందన్న మాట వాస్తవమే గానీ, ఇంజిన్లు మరమ్మతులకు గురవుతాయనేది మాత్రం అవాస్తవమని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

ఇంజిన్లు పాడవుతాయని ఈ౨౦పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని లోక్‌సభ వేదికగా గురువారం ఆయన తేల్చిచెప్పారు. ఉభయ సభల నుంచి కొందరు సభ్యులు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ౨౦ ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విస్తృతమైన ప్రయోగాలు చేసిందని, వాటిలో ఎక్కడా ఇంజిన్ మరమ్మతులకు గురైన ఘటన చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఈ౨౦ విధానం అమలైతే 2016 కంటే ముందు తయారైన బీఎస్ వాహనాలకు కొన్ని రబ్బరు విడిభాగాలు అమర్చుకుంటే సరిపోతుందని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియ కూడా ఒక చిన్న వెహికిల్ సర్వీసింగ్ లాంటిదేనని వివరించారు.

ఈ౨౦ విధానం అమలైతే పాత వాహనాలు పక్కన పెట్టాల్సిందేనని, అసత్య ప్రచారం జరుగుతుందని వాపోయారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా బీఎస్ -3, బీఎస్ -4, బీఎస్-6 వాహనాలపై సమగ్ర అధ్యయనం చేపట్టాయని గుర్తుచేశారు. పక్కా శాస్త్రీయ పద్ధతిలోనే దీనిపై అధ్యయనం జరిగిందని తెలిపారు. ఇంజినీర్లు ఈ౨౦ వాహనాలను నడిపిచూశారని, అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని స్పష్టం చేశారు.