ఐక్యతే బలం
ఆర్థిక క్రమశిక్షణకు ఆర్యవైశ్యులు ప్రతీక
- మీ సమస్యలను పరిష్కరిస్తాం
- హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
- సీఎం రేవంత్‌రెడ్డి హామీ
- ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు భూమి పూజ
ఉప్పల్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మా భిమానం కలిగినవారని, పేదరికం ఎదురైనా తమ కష్టాలను బయటకు చెప్పుకో కుండా కడుపులో దాచుకునే మనస్తత్వం వారిదని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆర్యవైశ్యులు కలిసికట్టుగా ఉంటేనే మరింత బలం చేకూరుతుందని సూచించారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆదివారం సీఎం భూమిపూజ చేశారు.
అనం తరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో గల్లాపెట్టె వ్యవహారాన్ని ఆర్యవైశ్యులకే అప్పగించామని గుర్తుచేశారు. ఆర్థిక లావాదేవీలకు సం బంధించి సలహాలు కావాలంటే ఆర్యవైశ్యులనే సంప్రదిస్తారని అన్నారు. ముఖ్య మంత్రులు ఎంతమంది మారినా ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య కొనసాగారని, ఆయన ఆర్థిక నిర్వహణలో చూపిన దూరదృష్టి, సమర్థత ప్రత్యేకమైనవని ప్రశంసించారు.
ఆకలి తీర్చే ధాతృత్వం..
ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని సీఎం అన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చే ధాతృత్వం వారిలో ఉందని ప్రశంసించారు. పేదలకు అవసరమైనప్పుడు ఉదారంగా అప్పులు ఇచ్చి ఆదు కుంటారని చెప్పారు. సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య సమాజం దేశానికి అందించిన సేవలను సీఎం ప్రస్తావించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ ఆర్యవైశ్య సమాజానికి చెందినవారని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా ఆర్యవైశ్యుడేనని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆర్యవైశ్యుల సేవలు చిరస్మరణీయమని అన్నారు.
రోశయ్య సలహా ఇప్పటికీ గుర్తుంది..
మాజీ సీఎం కొణిజేటి రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాను అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో ఆవేశాన్ని తగ్గించుకోవాలని రోశయ్య సూచించేవారని చెప్పారు. ఆవేశానికి ఆలోచన తోడైతే భవిష్యత్ ఉంటుంది అంటూ రోశయ్య ఇచ్చిన సలహాను సీఎం గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో తాను సుదీర్ఘకాలం రాణిస్తానని రోశయ్య ముందుగానే గుర్తించారని తెలిపారు.
రోశయ్య ఎవరినైనా విమర్శించేవారే తప్పా వ్యక్తిగతంగా దూషించేవారు కాదని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనం, సంయమనం, విలువలు ఎలా ఉండాలో ఆయన జీవితం నేర్పుతుందని అన్నారు. హైదరాబాద్‌తో తన అనుబంధం విడదీయరానిదని రోశయ్య చెప్పేవారని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం..
రోశయ్య సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. రోశయ్య ప్రజాసేవను భావితరాలు గుర్తుంచుకునేలా ఆయన విగ్రహం నిలిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ఆర్యవైశ్యుల సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకు ప్రధాన వేదికగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీ, మందమల పరమేశ్వర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.