జనగామ కూడలిలో ఎగిసిన భూ విముక్తి పోరాట ఎర్రజెండా
జనగామ,(విజయక్రాంతి): దొరల, దోపిడీదారులకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా పోరాడడమే ఎర్రజెండా లక్ష్యమని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (Marxist Communist Party of India) జనగామ జిల్లా సమన్వయకర్త కన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెప్టెంబరు 11 నుంచి 17 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా(Jangaon District) సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనగామ కూడలిలో భూ విముక్తి పోరాట పతాకమైన ఎర్రజెండాను ఆవిష్కరించారు.
జిల్లా సమన్వయకర్త కన్న శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించిన తరువాత మాట్లాడుతూ.. మంగళవారం రోజున జనగామ కేంద్రం నుండి ఒక బృందం, జాఫర్ గఢ్ నుండి మరో బృందం ప్రదర్శనగా బయలుదేరి కడవెండి, పాలకుర్తి, షేక్ బందంగి అమరవీరుల స్మారక కేంద్రాలను సందర్శించారని తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల ఆశయాల సాధనలో మళ్ళీ అంకితమవుతూ ప్రజా ఉద్యమాలను బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎర్రజెండా సిద్ధంగా ఉందన్నారు. దోపిడీ, భూస్వామ్య పెత్తందారీ పాలక వర్గానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల ఉద్యమ ప్రత్యామ్నాయం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని, అమరవీరుల ఆశయాలను ముందుకు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె. రవీందర్ గౌడ్, యాదగిరి, సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.