‘బలమే హక్కు’ నిలవదు
ద్వంద్వ ప్రమాణాలను వీడాలి
గ్లోబల్ సౌత్ కోసం ఐక్యతతో కొత్త అధ్యాయాన్ని లిఖించాలి
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
వాణిజ్యం, తయారీ, పెట్టుబడులు, సాంకేతిక, సైన్స్ రంగాల్లో సహకార వృద్ధి కోసం బ్రిక్స్‌లో ఐదు సూత్రాల ప్రణాళిక ఆవిష్కరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అంతర్జాతీయ వ్యవహారాలను బలం నిర్ణయించకూడదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping) బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శంలో అన్నారు. ఆయన సమాన ప్రపంచ నియమాలు, సంస్థాగత సంస్కరణలు, ఏఐ, ఆర్థిక సంబంధాలలో సహకారం కోసం పిలుపునిచ్చారు. వాణిజ్యం, తయారీ, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఐదు సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.
సరఫరా గొలుసులను (సప్లై చైన్లను) కాపాడటానికి, ఒక పెద్ద సమీకృత మార్కెట్‌ను ప్రోత్సహించడానికి బ్రిక్స్ కూటమి వర్ధమాన మార్కె ట్లు, గ్లోబల్ సౌత్‌తో ఉన్న తన సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకోవాలని అన్నారు. గ్లోబల్ సౌత్ కోసం ఐక్యతతో కొత్త అధ్యాయాన్ని లిఖించాలన్నారు. నియమాలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్లు లేని కూడలి లాంటిదని సూచించారు. అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాలూ కలిసి రచించాలని, బ్రిక్స్ అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ పాలనను పరిరక్షించాలని స్పష్టం చేశారు.
తమతమ బలాలతో సంబంధం లేకుండా అన్ని దేశాలూ అంతర్జాతీయ సమాజంలో సమాన సభ్యులే నని పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగింపు సభలో షీజిన్‌పింగ్ ప్రసంగిస్తూ, ‘బలమే హక్కు’ అనే తర్కాన్ని ఎప్పుడో విడనాడాల్సిందని స్పష్టం చేశారు. ‘గ్లోబల్ సౌత్ కోసం ఐక్యత ద్వారా బలానికి సంబం ధించిన ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే దిశగా కృషి చేయాలని బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. ‘నియమా లు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్లు లేని కూడలి లాంటిదని, అక్కడ గందరగోళం, అస్తవ్యస్తత దాదాపు ఖాయమని వెల్లడించారు.
నిష్పక్ష పాతం, న్యాయం అనేవి సార్వత్రిక ఆకాంక్షలని, అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాలూ కలిసి రచించాలని స్పష్‌టం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలు సంయుక్తంగా ‘అంతర్జాతీయ వ్యవహారాలలో చట్టబద్ధ పాలనను పరిరక్షించా లన్నారు. సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నిబంధనలను కాపాడాలని కోరారు.
అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ నిబంధనలు అందరికీ వర్తించేలా చూడాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో, ‘ద్వంద్వ ప్రమాణాలను’ వీడాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య శక్తులను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. ‘అన్ని దేశాలు, వాటి పరిమాణం, బలం లేదా సంపదతో సంబంధం లేకుండా, అంతర్జాతీయ సమాజంలో సమాన సభ్యులేనని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ‘గ్లోబల్ సౌత్ దేశాలు బహుళప క్షవాద పతాకాన్ని ఉన్నతంగా ఎగురవేయాలని, ఐక్యరాజ్యసమితి అధికారాన్ని, పాత్రను నిలబెట్టాలని అన్నారు.
సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో, సామర్థ్యాన్ని పెంచడంలో బహుళపక్ష సంస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ వ్యవహారాలలో అన్ని దేశాల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని ఆయన పునరుద్ఘా టించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావాలని కూడా చైనా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
మరింత శక్తివంతమైన బ్రిక్స్‌కు 5 సూత్రాల ప్రణాళిక
బ్రిక్స్ సహకారాన్ని పెంపొందించడానికి షీ జిన్‌పింగ్ ఐదు సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించారు. సమ్మిళిత కృత్రిమ మేధ వ్యవస్థను ఏర్పాటు చేయడం, వాణిజ్యంతో పాటు పెట్టుబడులను సులభతరం చేయడం, డిజిటల్ పరిశ్రమ సంబం ధాలను బలోపేతం చేయడం, ‘తెలివైన తయారీ‘ని ముందుకు తీసుకెళ్లడం, ఉమ్మడి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కార్యక్ర మాన్ని ప్రారంభించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేస్తూ వాటి గురించి వివరించారు.