రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం.. భారత్‌పై 100 శాతం సుంకాలు?..
భారత్, చైనాలకు 100% సుంకాలు విధించే అవకాశం
అమెరికా కీలక బిల్లు పాస్
వాషింగ్టన్: అమెరికా హౌస్ లో రష్యాపై ఆంక్షల బిల్లుకు ఆమోదం లభించింది. ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా చేస్తున్న యుద్ధానికి గాను, రష్యాను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశించిన విస్తృతమైన కొత్త ఆంక్షలను అమెరికా చట్టసభ సభ్యులు(US Congress) ఆమోదించారు. నెలల తరబడి ఆలస్యం తర్వాత ఈ చట్టాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(President Donald Trump) పంపారు. రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభ ఈ ప్యాకేజీని 262-159 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనితో, ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్కోకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన అత్యంత కీలకమైన శాసనపరమైన ప్రయత్నానికి తుది కాంగ్రెస్ ఆమోదం లభించింది.
గత నెలలో సెనేట్‌లో 86-11 ఓట్ల తేడాతో సులభంగా ఆమోదం పొందిన ఆ బిల్లుపై సంతకం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలను, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను(President Vladimir Putin), ఇతర ఉన్నతాధికారులను, అలాగే పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగించే రహస్య ట్యాంకర్ల సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
మాస్కో యుద్ధానికి నిధులు సమకూర్చే ఆదాయ వనరులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా, రష్యా చమురు, గ్యాస్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే చైనా, భారత్‌లతో సహా పలు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని కూడా ఇది ట్రంప్‌కు కల్పిస్తుంది. దీంతో భారత్ వాణిజ్య, ఇంధన రంగాల్లో కొత్త అనిశ్చితి వచ్చిపడింది. అయితే, ట్రంప్ కు సుంకాల అధికారలపై డెమొక్రాట్లు(Democrats) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీలో అగ్రశ్రేణి డెమోక్రాట్ అయిన గ్రెగొరీ మీక్స్, ఆ బిల్లులో "తీవ్రమైన లోపాలు" ఉన్నాయని పేర్కొన్నారు.