వట్టె జానయ్యకు అస్వస్థత
- గాంధీ ఆస్పత్రికి తరలింపు
- టీఆర్పీ శ్రేణుల్లో ఆందోళన
సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం వజ్ర టౌన్ షిప్‌నకు సంబంధించిన వివాదం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జానయ్యను అరెస్ట్ చేసి బల వంతంగా వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జానయ్య.. అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కొంతమేర ఇబ్బందికరంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తర లించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు.






