ఆర్ అండ్ బి రోడ్డుపై తరచు వాటరింగ్ చేయాలి

04-10-2026 | 09:23pm

వెంకటాపురంలో ఇసుక లారీల దుమ్ముతో అనారోగ్యంపాలవుతున్న ప్రజలు, వ్యాపారులు

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్డులో ఇసుక లారీల వల్ల వచ్చే దుమ్ము, ధూళి కారణంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపారులు, ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్నారని, రోజుకి ఐదు సార్లు అయినా రోడ్డుపై నీళ్లు చల్లి దుమ్ము, ధూళి అరికట్టాలని వ్యాపారులు, ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంకటాపురం చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంఘం, మండల కేంద్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటాపురంలోని శివాలయం నుంచి, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వరకు ఉన్న మెయిన్ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేసుకుంటూ చాలామంది జీవనోపాధి పొందుతున్నారు. మండల కేంద్రంలోని రోడ్లపై తిరిగే వందలాది ఇసుక లారీల వల్ల వచ్చే దుమ్ముతో వ్యాపారాలు చేసుకోలేక, శ్వాసకోశ వ్యాధులతో వ్యాపారాలు బంద్ చేసుకొని హాస్పిటల్ పాల్వుతున్నారని తెలిపారు. వీరిలో మధ్యతరగతి పేదవాళ్లు, వ్యాపారులు, రోజుకూలి పేదవాళ్లు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజల బాధను అర్థం చేసుకొని ఇసుక కాంట్రాక్టర్లతో, మేజర్ పంచాయతీ సహకారంతో రోజుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి వాటర్ క్యూరింగ్ చేయాలని కోరారు. ఈ విధంగా చేయడం వలన దుమ్ము కొంచెం తగ్గి ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వం ఇసుక లారీలలో వచ్చే సీనరీస్ చలానా అమౌంట్ గురించి చూసుకుంటుంది కానీ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా మండల అధికారులు స్పందించి వాటర్ క్యూరింగ్ చేయుటకు చర్యలు తీసుకోవాలని వెంకటాపురం చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంఘం, మండల కేంద్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదని, రాస్తారోకోలు, ఆందోళనలు జరగకముందే అధికారులు స్పందించి వాటర్ క్యూరింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు భద్రాచలం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, తహశీల్దార్, మండల పరిషత్ అధికారి, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ హౌస్ ఆఫీసర్, మేజర్ గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు సర్పంచ్ తదితర అధికారులకు, ప్రజాప్రతినిధులకు వర్తక సంఘం మరియు ప్రజలు పంపిన వినతిపత్రాల్లో కోరారు.

మరిన్ని వార్తలు