సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ
రోజురోజుకు కొత్త తరహా మోసాలు
ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్లతో ఉచ్చు
1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి
మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు
మెదక్, జులై 5 (విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.
బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థలు, లోన్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దన్నారు. ఇటీవలి కాలంలో ఏపీకే ఫైల్స్ పంపించడం, క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయించడం, నకిలీ లోన్ యాప్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓఎల్‌ఎక్స్ వంటి వేదికల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిల్ చేయడం, గిఫ్ట్ హ్యాంపర్లు, కేవైసీ అప్డేట్, రివార్డు పాయింట్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు కాజేసే ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు పంపిన లింకులు, ఫైల్స్ లేదా యాప్లను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం కార్డు వివరాలు, సీవీవీ నంబర్, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ సూచించారు.
అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వస్తే వెంటనే వాటిని నిర్లక్ష్యం చేసి సంబంధిత అధికారిక సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఆర్థిక సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. మోసం జరిగిన వెంటనే, ముఖ్యంగా ‘గోల్డెన్ అవర్‘లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తత, అవగాహన, సకాలంలో ఫిర్యాదు చేయడం కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు






