తుమ్మెన్ పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు
* స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం.. తులసీ పూజ
* ఉత్తమ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటన
అచ్చంపేట: నల్లమలలో సినీతారలు విరోష్ దంపతుల సందడి నెలకొంది. సినీ నటుడు విజయ్ దేవరకొండ సోమవారం తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామంలో తన భార్య, సినీనటి రష్మిక మందన్నతో కలిసి పర్యటించారు. గత నెల 26న రాజస్థాన్ లో వీరిద్దరి వివాహమైన విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ స్వగ్రామం తుమ్మెన్ పేట కావడంతో పెళ్లి తర్వాత నూతన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారిగా గ్రామానికి వచ్చారు.

గ్రామానికి చేరుకున్న వారికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు స్వాగతం పలికారు. ప్రత్యేక నృత్యాల నడమ వీరికి ఘన స్వాగతం లభించింది. అక్కడ వారి ఫామ్ హౌజ్ లో సతీసమేతంగా తులసీపూజ, సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. అనంతరం అక్కడే గ్రామస్థులు, సన్నిహితులకు ప్రత్యేక వివాహ విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం.. అభిమానులతో కొద్ది సమయం ముచ్చటించారు. వారితో సెల్పీలు దిగి అలరించారు.
అనంతరం వారిని ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తన తండ్రి కోరిక మేరకు అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తమ ట్రస్టు ద్వారా స్కాలర్ షిప్స్ అందజేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సేవను రాష్ర్ట వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామంలో తన పర్యటన నిరంతరంగా ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. సినీనటుల పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పామ్ హౌజ్ లోకి కేవలం ఎంట్రీ పాసులు ఉన్నా వారిని మాత్రమే అనుమతించారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనువాసులు, సీఐ నాగరాజు, బల్మూర్ ఎస్ఐ రాజేందర్ బందోబస్తు పర్యవేక్షించారు.

ప్రముఖుల హాజరు..
గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొని విరోష్ దంపతులను ఆశీర్వధించేందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ ఎంపీ రాములు, ప్రణాళిక సంఘం రాష్ర్ట అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కలెక్టర్ బాదావత్ సంతోష్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. విరోష్ దంపతులను చూసేందుకు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు భారీగా తరలివచ్చారు. వచ్చిన వారందరికి ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అభిమానులకు ప్లైయింగ్ కిస్ లతో కృతజ్నతలు తెలియజేశారు.





