2 May, 2026 | 9:53 PM

పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?

02-05-2026 08:36 PM

డీ సిల్టేషన్ కోసం నిర్వహించే గ్రామ సభలను నిలిపి వేయాలి

* బీఆర్ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ 

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట తహశీల్ పరిధిలోని అకినేపల్లి మల్లారం, రమణక్కపేట, వాడగూడెం గ్రామాలలో  డీ సిల్టేషన్ కోసం ఈ నెల 4 వ తేది( సోమవారం )న నిర్వహించనున్న గ్రామ సభలను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎంపిటిసిలు కుడుముల లక్మిిజనారాయణ, కొమరం రామ్మూర్తి లు శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెం గ్రామంలో గోదావరి నది వద్ద బ్రాహ్మణపల్లి వద్ద శివగంగ ఎత్తిపోతల పధకం నిర్మాణం చేశారని, ఆ ఎత్తిపోతల పతక ద్వారా గిరిజన, గిరిజనేతర రైతులకు వ్యవసాయ సాగు భూములకు నీరు అందించేదని,

ఆ ప్రాంతంలో గోదావరి నదిలోని బావి చుట్టూ ఉన్న ఇసుక మేట తొలగించుటకు సంబంధిత  ప్రభుత్వ శాఖల సర్వే రిపోర్టులు ఉన్నా అక్కడ డీ సిల్టేషన్ కోసం గ్రామ సభ తేదీలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. కాని మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం, రమణక్కపేట, వాడగూడెం గ్రామాలలో ఎలాంటి ప్రాజెక్టులు లేనప్పటికి డీ సిల్టేషన్ కోసం గ్రామ సభలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని వారు ఆ ప్రకటనలో ప్రశ్నించారు. బ్రాహ్మణపల్లిలోని శివగంగ ఎత్తిపోతల పధకం గోదావరి నదిలోని బావి చుట్టూ ఉన్న ఇసుక మేటలు తొలగించక పోవడంతో 2012 నుండి గత పద్నాలుగు సంవత్సరాల నుండి గిరిజన, గిరిజనేతర రైతులకు చెందిన 16 వందల ఎకరాలకు వ్యవసాయ సాగు భూములకు నీరు అందడం లేదన్నారు.

  బ్రాహ్మణపల్లిలోని శివగంగ ఎత్తిపోతల పధకం డీ సిల్టేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ చీప్ సెక్రటరీ , ప్రిన్సిపుల్ సెక్రటరీ టూ గవర్నమెంట్ (మైన్స్) మేమో నెం:2004/M.I1 (1) / 2022 ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ 9 సార్లు జిల్లా స్థాయి సాండ్ కమిటి ( డీఎల్ఎల్సీ ) లో ఆమోదించి ప్రభుత్వానికి పంపగా ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా గ్రామ సభ ఏర్పాటు చేయలేదన్నారు. శివగంగ ఎత్తిపోతల పధకం పరిధిలో 15 వందల గిరిజన కుటుంబాలు ఉన్నాయని, వ్యవసాయ సాగు నీరు కొరకు ఇసుక మేటలను తొలిగించాలని కోరినా గత జిల్లా కలెక్టర్ అర్ధం చేసుకుని  కూడా సహాయం చేయలేదని వారు ఆరోపించారు.

మంగపేట మండలం వాడగూడెం, రమణక్కపేట, అకినేపల్లి మల్లారం ఈ మూడు గ్రామాల వద్ద ఎప్పుడు ప్రాజెక్టులు కట్టారని, ఏ జీఓ ద్వారా ప్రాజెక్టులు నిర్మాణం చేశారని ప్రశ్నించారు. అసలు ఎ లాంటి ప్రాజెక్టులు లేని ప్రాంతంలో గోదావరి నదిలో డీ సిల్టేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం దేవరపల్లి గ్రామం  అశ్వాపురం మండలం అయ్యగారిపల్లి గ్రామం మధ్య ఉన్న సీతమ్మ సాగర్ మల్లీ పర్పస్ ప్రాజెక్ట్  మంగపేట మండలానికి సుమారు 70 కిలిమీటర్ల దూరం ఉంటుందని, ఆ ప్రాజెక్టు పేరుతో ములుగు జిల్లాలో డీ సిల్టేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం ప్రముఖ జిల్లా నాయకుడు, ప్రభుత్వ పెద్దలు సహకారంతో బినామీ కాంట్రాక్టర్లు వారి అభివృద్ధి కోసం డీ సిల్టేషన్ ప్రాజెక్టును తీసుకువచ్చారని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, రైతుల వ్యవసాయ బోరు లెవల్ పూర్తి స్థాయికి పడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఈ నెల 4 వ తేది( సోమవారం )న నిర్వహించనున్న గ్రామ సభలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిలిపి వేయని ఎడల లేని యెడల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎంపిటిసిలు కుడుముల లక్మిేసనారాయణ, కొమరం రామ్మూర్తిలు ఆ ప్రకటన ద్వారా హెచ్చరించారు.