వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి
గ్రామస్తులు ఇద్దరికీ తీవ్ర గాయాలు.
క్షతగాత్రులకు కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పరామర్శ.
సత్తుపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని కిష్టారం గ్రామ శివారులో కత్తితో నరికిన ఘటన తీవ్ర కలకలం రేగింది. కిష్టారం గ్రామంలోని నర్సింగ్ కళాశాల సమీపంలో గత కొన్ని నెలలుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని, తమ గ్రామ సమీపంలో వ్యభిచారాన్ని ఆపాలని నిలదీసిన ఇద్దరు వ్యక్తులపై సదరు వ్యభిచార గృహ నిర్వాహకులు కొబ్బరి బోండాలు నరికే కత్తులతో అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరు మండలానికి చెందిన నాగమణి, హనుమంతరావు దంపతులు సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకుని రహస్యంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. దీనివల్ల తమ గ్రామానికి చెడ్డపేరు వస్తోందని భావించిన కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు కొందరు శనివారం వ్యభిచార నిర్వాహకులకు వ్యభిచారాన్ని ఆపివేసి ఇతర వ్యాపారాలు నిర్వహించుకోవాలని తీరు మార్చుకోకపోతే గ్రామస్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నారా నిలిపివేశారా అనే విషయంపై ఆరా తీయడానికి మారోజు నాగేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు ఆదివారం రాత్రి వ్యభిచార ప్రదేశానికి వెళ్లారు గ్రామస్తుల హెచ్చరికలు పట్టించుకోకుండా వ్యభిచారాన్ని కొనసాగించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నిర్వహణపై మండిపడ్డారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నాగమణి, హనుమంతరావు దంపతులు ఇంట్లో ఉన్న కొబ్బరి బోండాలు నరికే పెద్ద కత్తులతో నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరినీ చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే నిందితులైన భార్యాభర్తలిద్దరూ ఘటనా స్థలం నుండి పరారయ్యారు. వ్యభిచార గృహంలో ఉన్న కొత్తగూడెంకు చెందిన సోనీ అనే యువతి పోలీసులకు పట్టుబడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న మారోజు నాగేశ్వరరావును రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.






