ఘనంగా నిమజ్జనాలు

26-09-2026 | 05:25am

భారీ బందోబస్తు, అడుగడుగునా నిఘా నేత్రాలు

నగర వ్యాప్తంగా 2 లక్షల వినాయక నిమజ్జనాలు పూర్తి

గంగమ్మ ఒడిలోకి చేరిన ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గత 11 రోజులుగా విశేష పూజలందుకున్న వినాయక నిమజ్జన(Vinayaka Immersions) క్రతువును శాంతియుతంగా పూర్తి చేసేందుకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా హుస్సేన్ సాగర్(Hussain Sagar), సరూర్‌నగర్ తదితర చెరువుల వద్ద మొత్తం 141 నిమజ్జన కేంద్రాలు, 275 క్రేన్లను ఏర్పాటు చేశారు.

234 మంది గజ ఈతగాళ్లను వివిధ చెరువుల వద్ద నియమించారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలో 45వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, 24కిపైగా డ్రోన్లు, 139 క్రైమ్ కంట్రోల్ టీమ్స్, షీటిమ్స్, రెస్క్యూ బోట్లు, విద్యుత్ అంతరాయాలు లేకుండా మొబైల్ స్టాటిక్ జనరేటర్లు, నిఘా కోసం వాచ్ టవర్లు, అంబులెన్సులు, వైద్యులు, అదనపు సిబ్బంది, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులను సిద్ధంగా ఉంచారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలను మోహరించామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand), సీపీలు సజ్జనార్, తరుణ్ జోషి, రమేష్, సుమతీలు ప్రకటించారు. ఏరియల్ వ్యూ ద్వారా వినాయక నిమజ్జనాల ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్ తదితరులు పర్యవేక్షించారు. శనివారం ఉదయం వరకు నిమజ్జనాలను పూర్తి చేస్తామని సీపీలు వెల్లడించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా నిమజ్జనాలు జరుగుతాయని భావిస్తుండగా ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే లక్ష నిమజ్జనాలు పూర్తి కానున్నాయి.

కాగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం 14,840 దరఖాస్తులు వచ్చాయని, 10వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని, శనివారం (నేడు) ఉదయం నిమజ్జన క్రతువును పూర్తి చేస్తామని సీపీ సజ్జనార్ ప్రకటించారు. హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నానికి క్రేన్ నెం వద్ద పూర్తి కాగా, బాలాపూర్ వినాయక నిమజ్జన యాత్ర 16 కిలోమీటర్ల మేర కొనసాగి క్రేన్ నెం. 12 వద్ద సాయంత్రానికి పూర్తయ్యింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు రావడంతో వారి కోసం ఆర్టీసీ వివిధ డిపోల నుంచి 700 ప్రత్యేక బస్సులను, 8 ప్రత్యేక రైళ్లను ఎంఎంటీఎస్ నడిపింది. 

మరిన్ని వార్తలు