బెంగాల్‌లో పేలుళ్ల కలకలం
చిట్టచివరి ఏడోదశ పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పలుచోట్ల ఘర్షణ
కోల్‌కత్తా, జూన్ 2: పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన చిట్టచివరి ఏడోదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అదేరోజు రాత్రి బరాక్‌పూర్‌లోని ఓ బీజేపీ నేత ఇంటి ఆవరణతో పాటు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యాలయం ఎదుట బాంబులు విసిరారు. సీసీ టీవీ ఫుటేజీలో బాంబు పేలుళ్లు స్పష్టంగా కనిపించాయి. బాంబుల మోతతో స్థానికులు భాయభ్రాంతులకు గురయ్యారు. రెండు ఘటనల్లో నూ ప్రాణహాని సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పేలుళ్లపై బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఒక్క బరాక్‌పూర్‌లోనే కాక పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ, టీఎంసీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పరస్పరం ఘర్షణ కు దిగారు. బసంతి ఎక్స్‌ప్రెస్ హైవేపై రెండు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీఛార్జీ తప్పలేదు. 24 పరగణాల జిల్లాలో టీఎంసీ మద్దతుదారు లు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఈవీఎంలను చెరువులో విసిరేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను రానివ్వకపోవడం, హింసాత్మక ఘటనలపై ఈసీకి శనివారం ఒక్కరోజే 2,667 ఫిర్యాదులు అందాయంటే రాష్ట్రం ఎలా అట్టుడికిపోయిందో అర్థం చేసుకోవచ్చు.






