రంగంలోకి నెజాద్
ఇరాన్ అధ్యక్ష బరిలో మాజీ అధ్యక్షుడు
టెహ్రాన్, జూన్ 2: ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2005 నుంచి 2013 వరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అధ్యక్ష అభ్యర్థిగా నెజాద్ తన పేరును రిజిస్టర్ చేసుకొన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఇరాన్ చట్టాల ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ నేరుగా పోటీ చేయటానికి వీలు లేదు. ఆ దేశంలోని అత్యున్నత నిర్ణాయక మత సంస్థ అయిన గార్డియన్ కౌన్సిల్ నిర్ణయించిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలుంటుంది. పోటీ చేయాలనుకొనేవారు ముందుగా గార్డియన్ కౌన్సిల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ కౌన్సిల్‌కు ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ నాయకత్వం వహిస్తారు. రిజిస్టర్ చేసుకొన్న అభ్యర్థులందరి ప్రొఫైల్స్‌ను పరిశీలించిన తర్వాత పోటీ చేసేందుకు అనుమతి ఇస్తారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీంరైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటంతో ఈ నెల 28న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నా రు. రిజిస్టర్ చేసుకొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి గార్డియన్ కౌన్సిల్ ఈ నెల 11న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తుంది. అయితే, నెజాద్ అభ్యర్థిత్వాన్ని గార్డియన్ కౌన్సిల్ తిరస్కరించే అవకాశం ఉన్నదని ఆ దేశ మీడియా పేర్కొన్నది. ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ మాజీ సభ్యుడైన నెజాద్‌ను 2017లో ఎన్నికల్లో పోటీ చేయకుండా గార్డియన్ కౌన్సిల్ నిషేధం విధించింది. ఖొమైనీ సర్వాధికారాలను నెజాద్ ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వైరం ఏర్పడి నెజాద్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారు. 2018లో కూడా దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని ఖొమేనీకి లేఖ రాసి నెజాద్ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌లో సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవరూ ఖొమైనీ అధికారాన్ని ప్రశ్నించటానికి వీలు లేదు.






