‘నాయకి’గా రాణిస్తోంది

05-05-2024 12:15:00 AM

ఇప్పుడున్న పరిస్థితులలో కథానాయికగా ఐదారేళ్ళు కొనసాగడమే చాలా ఎక్కువ. అటువంటిది ఇరవై రెండేళ్ళుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది అందాల తార త్రిష. 1999లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నైగా ఎంపికైన తర్వాత ‘జోడీ’ (1999) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, కథానాయికగా తొలి చిత్రమైన ‘మౌనం పేసియాదే’ (2002)తో తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రం ద్వారా తెలుగు తెరపైకి వచ్చిన త్రిషని, వర్షం (2004) సినిమాతో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ అక్కున చేర్చుకున్నారు తెలుగు ప్రేక్ష కులు. తర్వాత ఆమె వెనుదిరిగి చూసిందే లేదు.

తెలుగు, తమిళ భాషల్లోని ప్రముఖ కథానాయకులు, మేటి దర్శకులతో సినిమాలు చేస్తూ విజయ పరంపరను కొనసా గిస్తూ వచ్చింది. కాలానికి తగ్గట్టు తనను తాను మలచుకుంటూ కథానాయిక ప్రాధాన్యత గల చిత్రాలు చేయ డంతో పాటు ఇతర చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. హీరోయిన్ అంటే కేవలం రొమాన్స్ అన్న ముద్రను తీసివేస్తూ ‘96’ వంటి విభిన్న ప్రేమకథలను చేసిన త్రిష, మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో కుందవైగా చెరగని ముద్ర వేసింది. మొన్నటి ‘లియో’ లోనూ టీనేజ్  పిల్లల తల్లి పాత్రలో కనపడటానికి సైతం వెనుకాడలేదామె. ఈ మెరుగులే త్రిష ఇప్పటికీ ‘నాయకి’గా రాణించటానికి కారణం.

ఆమె సహచరులైన పలువురు అగ్ర కథానాయికలు అడదడపా అవకా శాలతో కొనసాగుతుంటే, త్రిష చేతిలో ఇప్పుడు మొత్తంగా ఐదు సినిమాలు ఉండటం విశేషం. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న    ‘విశ్వంభర’, కమల్ కలయికలో రానున్న ‘థగ్ లైఫ్’, అజిత్ హీరోగా నటిస్తున్న ‘విడా ముయార్చి’ చిత్రాలు చేస్తున్న ఆమె, మలయాళంలో మోహన్ లాల్ ‘రామ్’ మరియు టొవినో థామస్ ‘ఐడెంటటీ’ సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బృందా అనే వెబ్  సిరీస్‌లోనూ ఆమె భాగం కానున్నారు. శనివారం (మే 4) త్రిష పుట్టిన రోజుని పురష్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది ‘విశ్వంభర’ చిత్ర యూనిట్.