‘ఫోక్స్ వ్యాగన్’లో లక్ష ఉద్యోగాల కోత
జెర్మనీలో నాలుగు ప్లాంట్ల మూసివేతకు బోర్డు ఆమోదం
భారత్‌లోనూ 12 శాతం మంది తొలగింపు
పోటీ, పన్నులు, ఎలక్ట్రిక్ వాహనాలు భారం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్(Volkswagen) భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను తాజాగా విడుదల చేసింది. ఈ దశాబ్దం చివరి నాటికి లక్ష ఉద్యోగాలను తొలగించనున్నట్లు అందులో పేర్కొంది. నాలుగు ప్లాంట్ల మూసివేతకు కూడా ఫోక్స్ వ్యాగన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు గురువారం ఆమోదం తెలిపారు.
ఈ మేరకు కార్మిక సంఘాలు కూడా అంగీకారానికి వచ్చాయని యాజమాన్యం స్పష్టం చేశారు. ఫోక్స్ వ్యాగన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక భారీ వ్యయ నియంత్రణ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం 50,000 ఉద్యోగాల కోతతోపాటు, మోడల్ శ్రేణిని సగానికి తగ్గించడం, జర్మనీలోని నాలుగు ప్లాంట్లలో ఆటో ఉత్పత్తిని నిలిపివేయడం జరుగుతుంది. ఇప్పటికే అంగీకరించిన 50,000 ఉద్యోగాల కోతకు అదనంగా, కంపెనీ మరో 100,000 ఉద్యోగాలను కోల్పోతుంది.
చైనాలో తక్కువ ధరల పోటీని, అమెరికా సుంకాల వల్ల ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కోవడానికి సీఈఓ ఆలివర్ బ్లూమ్ ముందుకు తెచ్చిన ఈ ప్రణాళికకు, ఉద్యోగుల ప్రతినిధులు, కంపెనీలో వాటా ఉన్న ప్రాంతీయ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదురైంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్షమంది అంటే 15 శాతం ఉద్యోగులకు సమానం కావడం విశేషం. కంపెనీలో మొత్తం 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు.
ఒక్క జర్మనీలోనే సంస్థకు 43 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ నిర్ణయం వల్ల భారత్‌లో పనిచేస్తున్న 12 శాతం మంది ఉద్యోగాలు కూడా పోనున్నాయి. కాగా కోతలను వ్యతిరేకించినట్లు కార్మికసంఘాలు ప్రకటించినట్లు వార్తలొచ్చినా, ప్రస్తుతం సంస్థ మాత్రం కార్మిక సంఘాలు అంగీకరించాయని చెప్పడం కొసమెరుపు. ఈ సంస్థ ఫోక్స్ వ్యాగన్, ఆడి, పోర్షే, లంబోర్గినీ, బెంట్లీ వంటి కార్లతోపాటు స్కానియా, డుకాటీ వంటి ఖరీదైన టూవీలర్లను కూడా తయారు చేస్తుంది.
అయితే జర్మనీలోని ఎమ్డెన్, జ్వికావు, హనోవర్, ఆడికి చెందిన నెకర్సుల్మ్ ప్లాంట్లలో 2031 మధ్య వాహన ఉత్పత్తిని నిలిపివేయనున్నారు. అయితే ఈ ప్లాంట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ తన వాహన మోడళ్ల శ్రేణిని కూడా సుమారు 50 శాతానికి తగ్గించనుంది. ఫోక్స్‌వ్యాగన్ 89 ఏళ్ల చరిత్రలోనే ఇది అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణ.






