13 April, 2026 | 2:48 AM

దళిత సాహిత్య అలంకారికుడు శివసాగర్

13-04-2026 01:04 AM

పక్షుల రాగాల నడుమ

గరికపూల పాన్పు మీద

అమ్మా! నన్ను కన్నందుకు

విప్లవాభివందనాలు !

&

పొలాలలో పరిగె గింజ

ఏరుకునే వేళలందు

అమ్మా! నన్ను కన్నందుకు 

విప్లవాభివందనాలు!

&

ఏ తాడూ నన్ను ఉరితీయలేదు

సగర్వమైన నీ కన్నీళ్ల నుండి తిరిగి లేస్తాను

సూర్యనేత్రం నుండి లేచి వస్తాను

ప్రాణవాయువూది పిల్లనగ్రోవిని పలికిస్తాను

సంధ్యారాగంలో వాయులీనం వినిపిస్తాను .. అంటూ విప్లవాన్నీ, చైతన్యా న్ని అక్షర దోసిళ్లలో నింపి, ప్రకృతి సౌందర్యాన్ని అద్ది, కవిత్వానికి కొత్త నడవడిక నేర్పిన అరుదైన కవి కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్. ముఖ్యంగా దళిత సాహిత్యానికి ఆయన అం దించిన చైతన్యం ఒక గంధక ధూపం. మార్క్స్, లెనిన్ ఆలోచనా సరళికి అంబేద్కర్, ఫూలే భావజాలాన్ని మిళతం చేసి కొత్త టానిక్ తయా రు చేయాలని, తద్వారా కుల, వర్గ రహిత సమాజాన్ని తీసుకురావాలని కలలు గన్న కవి శివసాగర్. అభ్యుదయ, విప్లవ కవిత్వంలోని మూస ధోరణులను బద్దలు కొట్టిన మహాకవి ఆయన.

శివసాగర్ 1931లో నాటి కృష్ణా జిల్లా లో జన్మించారు. ఆయన తండ్రి సుప్రసన్నరావు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మిలటరీ ఉద్యోగి. తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తండ్రి క్రమశిక్షణ, సాహితీ అభిరుచి శివసాగర్‌పై బలమైన ముద్ర వేసింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కాజీపేట సెయింట్ గాబ్రియేల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడే ఆయనకు కొండ పల్లి సీతారామయ్యతో పరిచయం కలిగింది.

ఆ పరిచయం ఒక చారిత్రక మలుపుగా మారింది. ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి విప్లవ పథంలో అడుగులు వేశారు. సమాజంలోని అసమానతలను చూసి చలించిన శివసాగర్ ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తిస్థాయి విప్లవకారుడిగా మారారు. కొండపల్లి సీతారామయ్యతో కలిసి ఆయన పీపుల్స్ వార్ పార్టీని స్థాపించారు. పార్టీ మూల సిద్ధాంతకర్తల్లో ఆయన ఒకరు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో శివసాగర్ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. ఆయనే స్వయంగా ఊరూరా ఉద్యమానికి మద్దతుగా కరపత్రాలు పంచారు.

సామాన్య జనం నోళ్లపై

ఉద్యమ కాలంలో శివసాగర్ అనే కలం పేరుతో ఆయన రాసిన పాటలు తుపాకీ తూటాల కంటే వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లాయి. చదువు రాని అట్టడుగు ప్రజల నాలుకల మీద ఆయన కవిత్వం మరింత జీవం పోసుకుంది. శివసాగర్ కేవలం విప్లవకారుడు మాత్రమే కాదు. విప్లవ మార్గాన్ని వీడిన తర్వాత ఆయన దళిత సాహిత్యంలో సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు.

విప్లవ కవిత్వంలో ఆర్ద్రతను, కాల్పనికతను మేళవించి కవిత్వాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్ది వర్తమాన, భవిష్యత్తు కవులకూ మార్గదర్శకంగా నిలిచారు. ‘నర్రెంగ సెట్టుకింద నరుడో! భాస్కరుడా! /కన్నెర్ర సేస్తివయ్యా నరుడో! భాస్కరుడా/ కన్నెర్ర సేసి నీవు నరుడో భాస్కరుడా/ కదనాన దూకితివా నరుడో! భాస్కరుడా’ అంటూ శ్రీకాకుళ వసంత మేఘ గర్జన సమయంలో శివసాగర్ కవిత్వాన్ని, పాటను భుజానికెత్తుకున్నారు ఎత్తుకున్నారు శివసాగర్.

నక్సల్బరీ పోరాటం స్ఫూర్తితో శివసాగర్ ఆంధ్రదేశంలో ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు. శ్రీశ్రీ కవిత్వం మేధావులను ఆకర్షిస్తే శివసాగర్ పాట సామాన్య జనాన్ని కదిలించింది. ప్రజల నుంచి నేర్చుకున్నది మళ్లీ ప్రజలకు అందించడమే ఆయన ప్రధాన లక్ష్యం. అజ్ఞాతవాసంలో ఉంటూనే ఆయన అద్భుతమైన విప్లవ సాహిత్యాన్ని సృష్టించారు.

తెలుగు విప్లవ కవిత్వంలో శ్రీశ్రీ ఒక పర్వతం అయితే శివసాగర్ ఒక అగాధమైన సముద్రం. శ్రీశ్రీకి శివసాగర్ కవిత్వం అంటే ఎంతో గౌరవం. ముఖ్యంగా ‘నరుడో భాస్కరుడా’ పాటను శ్రీశ్రీ స్వయంగా ఆలపిస్తూ ఊరూరా తిరిగేవారు. శ్రీశ్రీ ఆ కవితను విప్లవ సాహిత్యానికి ‘టైటిల్ సాంగ్’ అని పిలిచేవారు. 

దళిత చైతన్యం వైపు

పీపుల్స్ వార్ పార్టీలో శివసాగర్ అత్యున్నత బాధ్యతలు నిర్వహించారు. అయితే పార్టీ నా యకత్వంలోని అగ్రకుల ఆధిపత్యం ఆయనను కలచివేసింది. దళితుడైన సత్యమూర్తిని ఎదగనివ్వలేదనే విమర్శలు దళిత వర్గాల నుంచి వచ్చాయి. కుల సమస్యపై పార్టీకి సరైన అవగాహన లేదని ఆయన విమర్శించారు. చివరకు పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

ఈ పరిణామం ఆయ నను మార్క్సిజం నుంచి అంబేద్కరిజం వైపు నడిపించింది. విప్లవ పోరాటంలో కు ల నిర్మూలన ఎజెండా ఉండాలని ఆయన బలంగా వాదించారు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని మేళవించి భారతీయ సమాజ స్థితిగతులకు అనుగుణంగా కొత్త సూత్రీకరణ చేశారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివసాగర్ దష్టి అంబేద్కర్, మహాత్మా ఫూలే ఆలోచనల మీద పడింది.

కత్తి పద్మారావు వంటి వారితో కలిసి అంబేద్కర్ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేశారు. ‘అంబేద్కర్ సూర్యుడు’ అనే గ్రంథం రాయడం ద్వారా దళిత సాహిత్యానికి కొత్త దిశ చూపారు. కులాధిపత్యం ఉన్న సమాజంలో వర్గ పోరాటం ఒక్కటే సరిపోదని ఆయన గుర్తించారు. జై భీమ్, లాల్ సలామ్ నినాదాలను ఒకే భుజంపై మోసిన విలక్షణ మేధావి ఆయన. చుండూరు ఊచకోత తర్వాత బాధితుల పక్షాన నిలబడి దళిత ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. ‘సామాజిక విప్లవ సమాఖ్య’ను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల గొంతుకగా మారారు.

సాహిత్యంలో ప్రయోగాలు 

శివసాగర్ దళిత సాహిత్యంలోకి రావడం ఒక ప్రభంజనం. విప్లవ కవిత్వంలో ఎర్ర సేన, నెత్తురు, జ్వాల, తుపాకీ వంటి పదాలే ఉండాలనే మూస పద్ధతులను ఆయన చెరిపివేశారు. వియత్నాం విప్లవ నేత హొచిమిన్ కవిత్వం నుంచి స్ఫూర్తి పొంది చందమామ, వెన్నెల, ఇప్పపూల వాసన, చిరుగాలి వంటి సామాన్య జనానికి తెలిసిన, ప్రకృతి సంబంధమైన పదాలను కవిత్వంలోకి తెచ్చారు.

‘మరణం ఓ అత్య ద్భుతం’ అని చెబుతూ మరణాన్ని కూడా సౌం దర్య దృష్టితో చూశారు. ‘ఉద్యమం నెలబాలు డు’, ‘నెలవంక’, ‘నడుస్తున్న చరిత్ర’ వంటి కవితల సంకలనాలు తెలుగు సాహిత్యంలో మైలు రాళ్లు. పీడనకు గురైన వారి బాధను పాటగా మలిచినప్పుడు అది ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఆయన నిరూపించారు. గిరిజన ప్రాంతాల నుంచి జానపద బాణీలను సేకరించి వాటికి విప్లవ రంగు అద్దారు.

శివసాగర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అక్షరాలు నిరంతరం జ్వలిస్తూనే ఉంటాయి. ఆయన సృష్టించిన సాహిత్య వారసత్వం నేటి తరం దళిత, బహుజన కవులకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఆయన కవిత్వంలోని సాంద్రత, క్లుప్తత, స్పష్టత అరుదైనవి. సామాజిక విముక్తి కోసం తపించే ప్రతి హృదయంలో శివసాగర్ కవిత్వం ప్రతిధ్వనిస్తుంది. అడవి పూల పరిమళంలా ఆయన కవిత్వం తెలుగు నేలపై ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాలం కడుపుతో ఉండి కన్న ఈ మహాకవి తెలుగు జాతికి . ఆయన చూపిన బాటలో దళిత, విప్లవ సాహిత్యం నానాటికీ బలోపేతమవుతున్నది.

అట్టడుగు వర్గాల గొంతుక

కవిత్వంలో అపూర్వమైన శబ్ద సౌందర్యాన్ని, ప్రకృతి దృశ్యాలను జోడించడం శివసాగర్ ప్రత్యేకత. ‘అలలపై నిఘా/ అలలుకనే కలలపైన నిఘా/ అలలపై అనురాగం చూపించే/ చిరుగాలి సితారా సంగీతంపై నిఘా’ అంటూ అలతి అలతి పదాలతోనే నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. జైలు నుంచి తప్పించుకున్న కామ్రేడ్స్ కోసం ఆయన రాసిన ‘రండర్రా! ఏ జామునైనా రండి/ నా కుటీరం తలుపులు అన్ని జాములా మీ కోసం తెరచి ఉంచాను’ అన్న వాక్యాల్లో విప్లవం పట్ల ఉండే గాఢమైన అనురాగం, ఆర్ద్రత స్పష్టంగా కనిపిస్తాయి. మరణాన్ని ఒక భయంకరమైన ముగింపుగా కాకుండా,

ఒక నూతన ఆరంభంగా చిత్రించడం ఆయన తాత్వికతకు నిదర్శనం. ‘ఉరితీయబడ్డ పాట నుంచి/ చెరపడ్డ జలపాతం నుంచి/ గాయపడ్డ కాలిబాట నుంచి.. తిరిగి వస్తాను/ తిరిగి లేస్తాను’ అని ప్రకటించిన తీరు ఆయన పోరాట స్ఫూర్తిని నిరంతరం రగిలిస్తూనే ఉంటుంది. ఒకవైపు సామాజిక విముక్తిని కోరుకుంటూనే, మరోవైపు వ్యక్తిగత భావోద్వేగాలను కూడా సమానంగా గౌరవించిన కవి ఆయన. వృద్ధాప్యంలో ఆయన రాసుకున్న ‘జీవితమా/ నా యౌవనాన్ని తిరిగి నాకివ్వు/ పొదలో పొంచివున్న అడివి ఎలుగు/ నాపై క్రూరాతి క్రూరంగా దాడిచేసే వేళ’ అన్న వాక్యాలు ఒక యోధునిలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయి. తన చుట్టూ ఉన్న అట్టడుగు వర్గాల భాషను, వారి కష్టాలను కవిత్వంలోకి జానపద బాణీలతో పట్టి తెచ్చి శివసాగర్ వారి గొంతుకగా నిలిచారు.

శివసాగర్ కవిత్వంపై 18న సాహితీ సభ

కేజీ సత్యమూర్తి (శివసాగర్) వర్ధంతి సందర్భంగా ఈనెల 18వ తేదీ సాయంత్రం ౬ గంటలకు హైదరాబాద్‌లోని సామ్రాట్  కమర్షియల్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్‌లో ‘శివసాగర్ కవిత్వం.. సారం సౌందర్యం’ పేరిట  సాహిత్య సభ జరుగనుంది. గాయకుడు, గేయ రచయిత లెల్లే సురేశ్ అధ్యక్షతన జరుగనున్న ఈ సభలో ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, రచయిత జె.విద్యాసాగర్, డాక్టర్ గుఱ్ఱం సీతారాములు, సుధాకిరణ్, మెర్సి మార్గరెట్ వక్తలుగా శివసాగర్ సాహిత్య కృషిపై ప్రసంగించనున్నారు.