జంక్ ఫుడ్‌పై హెచ్చరిక

12-09-2026 | 05:10am

చిన్నారుల ఆరోగ్యం(Children Health)పై జంక్ ఫుడ్(Junk food) ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల(Food items)పై స్పష్టమైన హెచ్చరికలు ముద్రించే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ప్యాకెట్‌పై స్పష్టమైన ‘ఎరుపు రంగు హెచ్చరిక’లు ప్రదర్శించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం ముదావహం.

అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తినడం మూలం గా దేశంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా అనారోగ్యాల బారిన పడుతు న్న విషయం విదితమే. గత కొంతకాలంగా విదేశాల్లో ఉండే విధంగా హె చ్చరిక లేబుల్ విధానాన్ని భారత్‌లోనూ అమలు చేయాలన్న చర్చ ఊపందుకున్నది. జంక్ ఫుడ్ ప్యాకెట్ ముందు భాగంలో ఉండే ఆకర్షణీయమైన చిత్రాలు చిన్నారులను విపరీతంగా ఆకర్షిస్తాయి. కానీ, వాటి వెనుక ఉండే ముడిపదార్థాల లేబుల్‌ను చూస్తే, అందమైన చిత్రాల మాటున దాగి ఉన్న కఠిన వాస్తవం తెలుస్తుంది.

ఆహారం ఆరోగ్యకరమైనదే అని భ్రమింపజేసే ఈ ధోరణిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మన దేశంలో విక్రయించే జంక్ ఫుడ్‌లో పోషక విలువల దా ఖలాలు ఎక్కడా కనిపించవని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. అధిక స్థాయిలో చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి విషపూరిత పదార్థాలతో నిం డి ఉండే ఈ ఆహారం చిన్నారుల పాలిట పెనుశాపంగా మారింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకా రం మన దేశంలోని చిన్నారుల్లో 93 శాతం మంది జంక్ ఫుడ్ తింటుండ టం ఆందోళనకరం.

తత్ఫలితంగా ఊబకాయం, టైప్ డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, రోగనిరోధక శక్తి క్షీణించడం వంటి దుష్పరిణామాలను చవిచూస్తున్నారు. భారతదేశంలో సుమారు 4 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నట్టు యూనిసెఫ్ నివేదిక హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో హెచ్చరికల ముద్రణ ఒక్కటే సరిపోదని చెప్పక తప్పదు. ప్యాకెట్‌పై కనిపించే ఆకర్షణీయమైన చిత్రాల ప్రచా రాలపైనా నియంత్రణ అనివార్యం. అంతేకాదు, పాఠశాల స్థాయి నుంచే పోషకాహారంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. అదే సమయంలో చిన్నారుల తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. భావి భారత పౌరుల భవిష్యత్తు అంధకారంగా మారకముందే హెచ్చరికల విధానం అమలుకు చర్యలు చేపట్టాలి.

మరిన్ని వార్తలు