29 August, 2026 | 9:35 PM

మీ జబ్బుకు మందేంటో నాకు తెలుసు!

29-08-2026 01:59 AM

జేఎన్‌యూ, ఉస్మానియా వర్సిటీని దారిలోకి తెచ్చాం

ఇక జేయూనే తరువాయి: బంగాల్ సీఎం సువేందు

జేయూ విద్యార్థి నేతలకు హెచ్చరికలు

కోల్‌కతా, ఆగస్టు ౨౮: ‘మీ జబ్బుకు మందేంటో నాకు తెలుసు. విశ్వవిద్యాలయాన్ని మావోయిస్టు సానుభూతిపరుల అడ్గా మారనివ్వను. ఇప్పుడు మీరు ‘ఆజాదీ‘ (స్వేచ్ఛ) అని నినదిస్తున్నారు.. ర్యాలీలు చేస్తున్నారు కదా. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయినప్పుడు ఎందుకు ర్యాలీలు చేయలేదు? ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎందుకు యుద్ధ వ్యతిరేక ర్యాలీలు చేశారు? మీ ఆటలు సాగనివ్వం’ అంటూ బంగాల్ సీఎం సువేందు అధికారి తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు.

కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం (జేయూ) ఆవరణలో శుక్రవారం బీజేపీ నిర్వహించిన వందేమాతర గీత సామూహిక సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ‘ఆజాదీ.. ఆజాదీ’ అంటూ ఆ ప్రాంతంలో నినదించారు. దీంతో సీఎం కోప్రోద్రిక్తుడై మాట్లాడారు.

విశ్వవిద్యాలయాన్ని మావోయిస్టులకు, కాశ్మీర్ స్వేచ్ఛను కోరుకునే వారికి అడ్డాగా మారనివ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ), హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తాము దారికి తెచ్చామని, ఇక జేయూనే తరువాయి అంటూ చురకలంటించారు. ఇప్పుడు యావత్ దేశమంతా జాతీయతా భావాల తుఫాను మొదలైందని ఉద్ఘాటించారు. మావోయిస్టు భావజాలానికి కాలం చెల్లిందని కొట్టిపడేశారు.