మండుటెండల్లోనూ చెరువులకు జలకళ
ఎల్లమ్మ సిద్దోగం ఉత్సవాలకు రూ.50 వేల విరాళం అందజేసిన హరీష్‌రావు
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 14: ఒకప్పుడు నీటి కొరతతో ఇబ్బంది పడిన నారాయణరావుపేట ప్రాంతం నేడు నిండు చెరువులు, పచ్చని పంటలతో అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎల్లమ్మ సిద్దోగం ఉత్సవాల్లో పాల్గొని రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 9 ఏళ్ల తర్వాత ఉత్సవాలు వైభవంగా జరగడం ఆనందంగా ఉందన్నారు.
చెరువులు నిండి ఉండటం, సాగు విస్తరించడం ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో వలసలు వెళ్లిన ప్రజలు, ఇప్పుడు వ్యవసాయ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి కూలీలు రావడం అభివృద్ధిని సూచిస్తోందన్నారు. ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, నీటి సౌకర్యాల కల్పనతో ప్రాంతం మరింత పురోగమిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






