నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నీటి గండం

17-09-2026 | 05:30am
  1. రూ.కోట్లు వేచించినా తప్పని నీటి తిప్పలు 
  2. అడుగంటిన రంగనాయక సాగర్ జలాలు
  3. బోర్లు, ట్యాంకర్లే దిక్కు
  4. రోజుకు 3 లక్షల లీటర్ల నీటి సేకరణ

సిద్దిపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి)/నంగునూరు: కోట్ల రూపాయలు వెచ్చించి సిద్దిపేట జిల్లా(Siddipet District) నర్మెట్ట(Narmetta)లో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ(Oil Palm Factory)కి నీటి గండం(Danger involving water) తప్పడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఫ్యాక్టరీ నిర్వహణకు నీటి కరువు ఏర్పడిందని రైతులు(Farmers) ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైన 6నెలలకే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు(Khammam and Bhadradri districts) మినహా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల ఆయిల్ పామ్ రైతులకు ఈ కర్మాగారమే ప్రధాన ఆధారం. రూ.300 కోట్ల భారీ వ్యయంతో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ కీలకమైన సీజన్‌లోనే నీటి కొరత వేధిస్తుండటం పట్ల ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

నిలిచిన కాళేశ్వరం నీటి సరఫరా

ఫ్యాక్టరీ ఆవరణలోనే 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో ఒక జలాశయాన్ని (పాండ్) నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని రంగనాయక సాగర్ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా ఇక్కడికి నిరంతరం నీటి సరఫరా జరిగేది. కాళేశ్వరం నీటిని విడుదల చేయకపోవడంతో రంగనాయక సాగర్ జలాశయంలో నీటి కొరత ఏర్పడింది. దాంతో ఫ్యాక్టరీకి నీటి సరఫరా నిలిపోయి ఫామ్ పాండ్ ఎండిపోయింది. ఈ ఫ్యాక్టరీ గంటకు 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఉత్పత్తి పెరిగే కొద్ది క్రషింగ్ సామర్థ్యాన్ని రోజుకు 600 టన్నులకు పెంచుకునే విధంగా రూపకల్పన చేశారు. కానీ నీటి కొరత వల్ల పూర్తి స్థాయిలో క్రషింగ్ జరగడం లేదు. ఫ్యాక్టరీ ప్రారంభమైన 6 నెలలకే నీటి గండంలో చిక్కుపోవడం గమనార్హం.

ట్యాంకర్లతో నీటి సేకరణ

ఫ్యాక్టరీలో ఆయిల్ పామ్ క్రషింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి నిత్యం 6 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉండటంతో కేవలం 3 నుంచి 4 లక్షల లీటర్లు మాత్రమే కొత్త నీటిని సేకరిస్తున్నారు. మిగతా అవసరాన్ని పాత నీటిని రీసైకిల్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. స్థానిక బోర్లతో పాటు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతూ రోజుకు 60 నుంచి 80 ట్యాంకర్ల నీటిని (ఒక ట్యాంకర్ రూ.300 చొప్పున వెచ్చించి) కొనుగోలు చేస్తూ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఆయిల్ పామ్ క్రషింగ్‌కు పీక్ సీజన్ కావడంతో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రోజు వారీ ఫ్యాక్టరీ కోసం బోర్లపై ఆధార పడినా భవిష్యత్ లో నీటి ఎద్దడి మరింత తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు. 

టన్ను రూ.25వేలకు పైనే

మరోవైపు ఈ ఏడాది ఆయిల్ పామ్ గెలలకు డిమాండ్ పెరిగింది. రైతులు నాలుగేళ్ల క్రితం సాగు చేసిన పంట చేతికొస్తుంది. టన్నుకు రూ.25వేలకు పైగా మద్దతు ధర లభించడంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఫ్యాక్టరీలో తలెత్తిన నీటి కొరత సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచనల మేరకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నాం. పీక్ సీజన్‌లో రైతులకు, క్రషింగ్ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా నీటి సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరంలో నేటికి 10,500 టన్నుల క్రూడాయిల్‌ను టన్ను రూ.1,30,000 చొప్పున విక్రయించాం.

 ప్రణేశ్, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇన్‌చార్జి

సిద్దిపేట మీద కక్షతోనే రైతులకు ద్రోహం

మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తుంది. చివరికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా నీరు ఇవ్వడం లేదు. మోటార్లు నడపడానికి, నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నా సిద్దిపేట మీద కక్షతోనే ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం మిడ్ మానేరులో నీళ్లు ఉన్నాయి. ఇప్పటికైనా మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్‌కు 2 టీఎంసీలు విడుదల చేసి, ఆయిల్ ఫ్యాక్టరీని, రైతుల్ని అందుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు విడుదలయ్యే అవకాశముండి కూడా రైతులను మోసం చేయడం క్షమించరాని ద్రోహం. వెంటనే నీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు