జల వివాదాలకు చెక్ పెట్టాలి!
ఉమ్మడి ఏపీలో దశాబ్దాల నాటి నుంచే కృష్ణా, గోదావరి జలాల విషయంలో వివాదాలు ఉన్నాయి. అయితే విభజన తర్వాత అది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త నీటి చిచ్చును తీసుకొచ్చింది. కృష్ణా జలాల వాటాలో ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం వాటాను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పన్నెండేళ్లు కావొస్తున్నా నీటి వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నా యి. ఇప్పటికే కీలకమైన నదీ జలాల పం పిణీ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు తమ హక్కులు కాపాడుకోవడానికి నిరంతరం పోరాడుతున్నా యి. ఢిల్లీ కేంద్రంగా పంచాయతీలు పెడుతున్నా ఎటూ తేలడం లేదు. తెలుగు నాట గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో ఈ పోరు రావణకాష్టంలా మండుతోంది. ఈ నదీ జలాల్లో ఎవరి వాటా ఎంతా? ఎవ రి మోసం ఏమిటనే విషయాలు కొలిక్కి రావడం లేదు. నిజానికి రాష్ర్టం రెండుగా చీలిన తర్వాత కొత్త నీటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలూ దృష్టి సారించాయి.పెరిగిన అవసరాలు, కనిపిస్తున్న అవకాశాలు ప్రజలకు ఇచ్చిన హామీలు వెరసి కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నా యి. అయితే కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే నికర జలాలు ఎంత? మిగులు జలాల్లో ఎంత వాటా సముద్రంలో కలుస్తుందనే లెక్కలు తేలాల్సి ఉంది.
మరోపక్క సముద్రంలో కలిసే వృధా జలాలను దిగువ రాష్ర్టంగా తాము వాడుకుంటామని ఏపీ వాదిస్తోంది. సాగరంలో కలిసే నీటి నుంచి కొంత తీసుకుని బనకచర్ల వంటి ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల మధ్య అగ్గిని రాజేసింది. ఆ వేడి సెంటిమెంట్‌గా మారి తమకు మేలు జరుగుతుం దని బీఆర్‌ఎస్ ఆశపడింది. అసలు నీళ్ల పం పకాల్లో ద్రోహులెవరో తేల్చితే కాంగ్రెస్ కొ న్ని కాలాలపాటు నిలబడుతుందని అసెంబ్లీ సాక్షిగా యుద్ధ వాతావరణం తలపించే వి ధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుస్తీ పట్టాయంటే అతిశయోక్తికాదు. ‘తోలుతీస్తాం’.. ‘బట్టలూడదీస్తాం’ అని పేర్కొన్న కేసీఆర్ చర్చకు రాకపోవడం, బీఆర్‌ఎస్ శాసనసభ నుంచి వాకౌట్ చేయడంతో సీన్ కాస్తా రివర్స్ అయింది.
వాదనల పర్వం..
ఉమ్మడి ఏపీలో దశాబ్దాల నాటి నుంచే కృష్ణా, గోదావరి జలాల విషయంలో వివాదాలు ఉన్నాయి. అయితే విభజన తర్వాత అది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త నీటి చిచ్చును తీసుకొచ్చింది. కృష్ణా జలాల వాటాలో ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం వాటాను ఇస్తూ నిర్ణ యం తీసుకున్నారు. దీనిని సరిసమానం (50:50) చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని ఎ క్కువగా వినియోగిస్తోందని, దీనివల్ల ఆంధ్ర లో సాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ఎప్పుడు ఎంత నీటిని వాడుకోవాలన్న దాని పై ఈరోజుకు కూడా పరిష్కారం లభించలేదు.
తమకు కేటాయించిన ప్రకారం ప్రాజె క్టులు కడితే అప్పుడు ఎంత మిగులు జలాలు ఉన్నాయి, సముద్రంలో కలిసే వృధా జలాలు ఎంత అనే లెక్క తేలకముందే, సముద్రంలో కలిసే నీటిలో కూడా తెలంగా ణా వాటా ఉందని ఆ రాష్ర్టం వాదిస్తోంది. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా 90టీఎంసీలు వచ్చే విధంగా కృషి చేస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెప్పుతుంది. నాడు అనుభవజ్ఞులు 14 మంది ఇంజనీర్లు 318 మీటర్ల ఎత్తులో ఉన్న జూరాల ప్రాజెక్టు వద్దని మొత్తుకున్నా 240మీటర్ల ఎత్తున ఉన్న శ్రీశైలం నుంచి పంపింగ్ చేసే విధంగా కేసీఆర్ డిజైన్ చేసి తప్పు చేసారని నీటి నిపుణులు పేర్కొన్నారు.
నాడు అంచనా వ్యయం రూ. 32,300 కోట్లుగా ఉంటే ప్రాజెక్ట్ అంచనా రూ. 55,800 కోట్లకు పెంచారని, అయినా 2015లో శ్రీకారం చుడితే 2022 వరకు కూడా డీపీఆర్ రాలేదు. కృష్ణా జలా ల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు.. అందు లో మాకు 299 టీఎంసీలు చాలంటూ 2015, జూన్ లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒప్పుకోవడ మే నేడు తెలంగాణకు శాపంగా మారింది. గోదావరి ఉపనది ప్రాణహితలో తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత సరిపోదని మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించడానికి డిజైన్ మార్చి రూ. 94వేల కోట్లకు పెంచినా జనం పట్టించుకోలేదు, సరిగ్గా ఎన్నికల ముందు పిల్లర్లు కుంగడంతో ‘కమిషన్ల కొరకు కాళేశ్వరం’ అని కాంగ్రెస్ ప్రచారం చేయడంతో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది.
సమస్యలే అధికం..
ఆంధ్రప్రదేశ్.. పట్టిసీమ, పులిచింతల వం టి ప్రాజెక్టుల ద్వారా తమకు రావాల్సిన దా ని కంటే ఎక్కువ నీటిని మళ్లించుకుంటోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ది. అయితే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో తెలంగాణ నీటిని ఎక్కువగా వాడుకుంటోందని మరోవైపు ఏపీ ఆరోపిస్తుంది. గోదావరి మీద ఏపీ పోలవరం ప్రా జెక్ట్ నిర్మిస్తోంది. అయితే దీని వల్ల తమ రా ష్ర్టంలో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని తెలంగాణ గగ్గోలు పెట్టినా కేంద్రంలోని బీజే పీ పట్టించుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు, అనుసరించిన విధానాలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త ప్రాజెక్టుల ఆలోచనలు కల్పించాయి.
నాడు కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమను చే స్తానని చెప్పిన మాటలనే ఆయుధంగా మ లుచుకుని ఏపీ పాలకులు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు రేవంత్ చొరవ వల్లే రద్దయ్యింది. దీంతో ఏపీ అనేక సవరణలు చేసి నల్లమల సాగర్‌గా పేరు మార్చి కేంద్రానికి కొత్త డీపీఆర్‌ని పంపించింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 1,480 టీఎంసీల నీళ్లకు మా త్రమే అనుమతి ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగానే ఏపీ నీటిని మళ్లిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. దాంతో అంచనా వ్య యం కూడా ఏటికేడు బాగా పెరిగిపోతోంది. నీళ్ల పంపకాల కంటే రాజకీయంగా సెంటిమెంట్లు, జల జగడాల సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేంద్రం జో క్యంతో ఈ జల వివాదాలు పూర్తిగా సమసిపోవాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుం టున్నారు.
బీఆర్‌ఎస్‌పై విమర్శలు..
ఇక తెలంగాణ అసెంబ్లీ వేదికగా నదీజలాల పంపకం, ప్రాజెక్టుల నిర్వహణ అంశం కాంగ్రెస్ గ్రాఫ్‌ని పెంచిందని చెప్పొచ్చు. ఉ మ్మడి రాష్ర్టంలో సాగునీటి రంగంలో అనేక కష్ట నష్టాలకు తెలంగాణ గురైందని.. కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వా టాను కాపాడుకుని తీరాలని సీఎం రేవంత్ సర్కార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వా రా వివరించింది. రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలని తెలంగా ణ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతూ వ చ్చింది. కానీ తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టింది.
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులపై నాటి ప్రభు త్వం రూ. 1,25,527 కోట్లు ఖర్చుచేస్తే, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేవలం రూ. 41,375.81 కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే దీనిపై ఎదురుదాడి కి దిగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభలో నీళ్ల లొల్లికి, వచ్చిన నిందలకు సమా ధానం చెప్పుతారని భావించారు. కానీ, అయన శాసనసభ్యునిగా అర్హత కోల్పోకుం డా సంతకం చేసి, చర్చకు రాకుండా మొఖం చాటేయడంతో కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అనే విమర్శలు వచ్చాయి. మూపీ ప్రక్షాళన విషయంలో సమావేశాలను బాయ్‌కాట్ చేయడం ద్వారా బీఆర్ ఎస్ పెద్ద తప్పు చేసింది. ఐదు రోజుల పా టు 13 బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరిగితే ప్రతిపక్ష పార్టీ బాధ్యతరహితంగా సభ నుంచి వాకౌట్ చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారు. శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా బీఆర్‌ఎస్ తనకు తానుగా విమర్శలకు తావిచ్చినట్లయింది.
వ్యాసకర్త సెల్: 9866255355
డాక్టర్ సంగని మల్లేశ్వర్






