09-01-2026 12:00:00 AM
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉరుముల్లేని పిడుగులా అమెరికా, రష్యా మధ్య నిప్పు రాజుకోవడం ఆసక్తిగా మారింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు చమురే ప్రధాన కారణం. వెనిజులాకు చెందినవిగా భావిస్తున్న రెండు నిషేధిత చమురు నౌకలను అమెరికా బుధవారం దిగ్బంధించింది. అమెరికా పట్టుకున్న రెండు నౌకల్లో ఒకటి బెల్లా 1 కాగా.. రెండోది సోఫియా. అమెరికా సాగించిన ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వీటిలో ఒకదానిని ఉత్తర అట్లాంటిక్, మరొకదాన్ని కరీబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే అవి తమ నౌకలేనంటూ రష్యా పేర్కొనడం సంచలనం కలిగించింది.
తొలుత వాటిలో ఒక ట్యాంకర్ మాత్రమే తమదని రష్యా చెప్పినట్టు వార్తలొచ్చినా, ఆ తర్వాత కాసేపటికే రెండు తమవేనంటూ ప్రకటన చేసింది. దీంతో చమురు నిక్షేపాల కోసం అమెరికా ఒక సముద్రపు దొంగగా మారిపోయిందని, అంతర్జాతీయంగా ఉన్న చట్ట నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి తమ నౌకలను దిగ్బంధించడం క్షమించరాని చర్యగా రష్యా అభివర్ణించింది. వాటి రక్షణ కోసం జలాంతర్గాములను ఇప్పటికే అట్లాంటిక్ మహాసముద్రానికి తరలించినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా చర్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్రుగా ఉన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం ప్రతిపాదనను ప్రోత్సహిస్తూనే మరోవైపు తమ నౌకలను అక్రమంగా బంధించి పట్టుకెళ్లడం క్షమించరాని చర్యగా పేర్కొన్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఇలాగే ఉల్లంఘిస్తే మాత్రం మిలిటరీ చర్యను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాల్సి వస్తుందని రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో ఇప్పటికే ఉప్పు, నిప్పుగా ఉన్న అమెరికా, రష్యా మధ్య జరిగిన తాజా వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అమెరికా మాత్రం చమురు తరలిస్తున్న నౌకలను బంధించడాన్ని సమర్థించుకుంటుంది.
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలతో 2024లోనే బెల్లా 1 నౌకను నిషేధించినట్లు తెలిపింది. ఇది ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తూ ఆమెరికా ఆంక్షల నేపథ్యంలో అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. మరినేరాగా పేరు మార్చుకున్న ఈ నౌక రష్యా జెండాతో అట్లాంటిక్ సముద్రంలో తిరుగుతోంది. తాజాగా ఈ నౌకనే తాము స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా రక్షణ మంత్రి జాన్ హీలే వివరించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అనాలోచిత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వెనిజులా చమురు మొత్తం తమదేనంటూ ఇప్పటికే బహిరంగంగా ప్రకటిం చిన ట్రంప్ తదుపరి అడుగులు ఎటువైపు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు భారత్ పట్ల అసహన వైఖరిని ట్రంప్ పెంచుకుంటూ పోతున్నారనిపిస్తున్నది. తాజాగా ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 500 శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఇదే జరిగితే భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశముంది.