మహానగరంలో నీటి దోపిడీ
ఇష్టారాజ్యంగా బోర్ల తవ్వకాలుభూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమార్కులు
- ట్యాంకర్ల ద్వారా జోరుగా అమ్మకాలు
- అక్రమార్కులకు చుట్టంగా మారిన వాల్టా చట్టం
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (విజయ క్రాంతి): ఎండాకాలం వచ్చింది అంటే చాలు నీటి కొరత ఏర్పడుతుంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు నీటి దోపిడీకి దిగుతున్నారు. ట్యాంకర్లు పెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మహా నగరంలో వాటర్ ట్యాంకర్ల దందా జోరుగా సాగుతుంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ నీటి వ్యాపారానికి తెరతీశారు.
వాల్టా చట్టానికి తిలోదకాలు ఇస్తూ అనధికారికంగా బోర్లను ఏర్పాటుచేసి నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లను ఏర్పాటు చేసి లక్షల గ్యాలన్ల నీటిని తోడేస్తున్నారు. అన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం మిన్నకుండి చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ట్యాంకర్లకు ట్యాంకర్ల నీటిని అక్రమంగా విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్న వారికి ఈ భూగర్భ జలాలను తోడుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఎవరు..? రోజుకు ఎన్ని ట్యాంకర్లు తోడుకోవచ్చు..? రోజుకు లక్షల గ్యాలన్ల నీటిని స్టోర్ చేసి అమ్ముకునే అవకాశం ఎవరు కల్పించారన్నది అధికారులకే తెలియాలి.
ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు..
శేరిలింగంపల్లి మండల వ్యాప్తంగా అనునిత్యం పదుల సంఖ్యలో నూతనంగా బోర్ల తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం కొత్తగా బోరు వేయాలనుకునే వారు విధిగా తహశీల్దార్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకున్న తర్వాతనే బోర్లు వేసుకోవాల్సి ఉంటుంది.
కానీ శేరిలింగంపల్లి మండలంలో అలాంటి నిబంధనలు ఏమీ పట్టకుండానే అధికారుల అనుమతులు లేకుండానే బోర్ వెల్స్ యాజమాన్యాలు యథేచ్ఛగా తమపని తాము చేసుకుపోతున్నాయి. ఇటు అధికారులు కూడా పోనీలే నీటి అవసరాల కోసమే కదా అని చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు విచ్చలవిడిగా బోర్లు తవ్వేసి నీటి వ్యాపారం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో బోర్ల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
అడుగంటుతున్న భూగర్భ జలాలు..
ఇష్టారాజ్యంగా బోర్లను తవ్వుతున్న కొందరు వ్యక్తులు నీటి వ్యాపారాన్నే తమ ప్రధాన ఆదాయవనరుగా మలుచుకుని, అనునిత్యం బోర్ల నుండి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు భారీ సంపులను నిర్మించి రాత్రి, పగలు అనే తేడాలేకుండా అందులోకి తోడుతున్నారు.
అలాగే అక్కడి నుండి బయటకు సరఫరా చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో భూగర్భ జలాలు ఇంకిపోయి భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలల పరిధిలోని చాలా డివిజన్లలో ఈ నీటి దందా జోరుగా సాగుతుంది.
ఖానామెట్ ఇజ్జత్ నగర్ లో ఈ నీటి దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇలా రోజుకు లక్షల గ్యాలన్ల నీటిని తోడేయడం వల్ల తమకు సరిగా నీరు రావడం లేదని చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హఫీజ్ పేట్, కొండాపూర్, తదితర డివిజన్లలో ఇంకొందరు తమా అపార్ట్మెంట్ల ముందు బోరును ఏర్పాటుచేసి ట్యాంకర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. అదేంటి అంటే మా దగ్గర పుష్కలంగా నీరుందని, అమ్ముకుంటే మా అపార్ట్మెంట్ అవసరాలకు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. హఫీజ్ పేట్ లో ఇంకో వ్యక్తి చెరువు స్థలంలో బోరువేసి ఆ నీటిని అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నా అధికారులకు పట్టడం లేదు.
ట్యాంకర్లకు ట్యాంకర్ల నీటి దోపిడి..
నగరంలో వాటర్ బోర్డు అందించే ట్యాంకర్లు లేట్ అవుతుండడంతో జనం ప్రైవేట్ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. వాస్తవానికి వాటర్ బోర్డు
5 వేల లీటర్ల ట్యాంకర్ కు రూ.500, 10 వేల లీటర్ల ట్యాంకర్లకు రూ.850 తీసుకుంటోంది. స్థానికంగా వాటర్ బోర్డు ట్యాంకర్లు అందుబాటులో లేక చాలా మంది ప్రైవేటు ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ట్యాంకర్ల ఆపరేటర్లు 5 వేల లీటర్ల ట్యాంకర్ కు రూ.1,0001,500, 10 వేల లీటర్ల ట్యాంకర్కు రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్యాంకర్లు విధిగా వాటర్ బోర్డులో నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరఫరా చేయాలని నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం, కొందరు అధికారుల చేతివాటం నీటి వ్యాపారులకు వరంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.




