31 July, 2026 | 10:06 PM

అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

31-07-2026 09:26 PM

- జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, అర్హుల పూర్తి వివరాలను నిర్ణీత గడువులోగా జిల్లా కేంద్రానికి పంపించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఇన్‌చార్జి పీడీ హౌసింగ్ గోపాల్ నాయక్, హౌసింగ్ ఏఈలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, నిజమైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ఫీల్డ్ వెరిఫికేషన్‌ను వేగంగా పూర్తి చేసి తుది జాబితాలను సిద్ధం చేసి వెంటనే జిల్లా కేంద్రానికి పంపించాలని సూచించారు.

గుడిసెల్లో నివసించే నిరుపేదలు, ఇల్లు లేని కుటుంబాలు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులకు రెండో విడతలో ప్రాధాన్యం కల్పించాలని తెలిపారు. అనర్హులు జాబితాలో చోటు దక్కకుండా, అర్హులు ఎవరూ మినహాయింపుకు గురికాకుండా గ్రామ, మండల స్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమాచారం పంపడంలో నిర్లక్ష్యం,  జాప్యానికి తావివ్వకుండా నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీఓ శ్రీరాములు, హౌసింగ్ ఏఈలు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.