27 February, 2026 | 12:12 PM

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2,160 ఇండ్లను ఒకేచోట నిర్మిస్తున్నాం

27-02-2026 12:00 AM
  1. మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభోత్సవం

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 

రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హుజూర్ నగర్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి రూ.22,500 కోట్ల బడ్జెట్ తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హుజూర్ నగర్ పట్టణం లోని రామస్వామి వద్ద  110 ఎకరాలలో 125 కోట్ల రూపాయలతో  నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, మొక్కలు నాటడం, వైట్ వాష్ పనులను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో  హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుపేదలు,వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లులో పనిచేసే వారికి  ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి పనులు ప్రారంభించడం జరిగిందని  కానీ రాష్ట్ర విభజన తర్వాత  ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మధ్యలోనే  నిలిపివేసి డంపింగ్ యార్డ్ మాదిరిగా మార్చిందని బిఆర్‌ఎస్ పై మండిపడ్డారు. 

తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 14 సంవత్సరాల నా పట్టుదల , కృషి ఆకాంక్షలతో తిరిగి పనులను ప్రారంభించి ప్రాజెక్టును పూర్తిచేసి పేద ప్రజలకు అందించడం నా చిరకాల స్వప్నం నెరవేరుతుందని సంతోష వ్యక్తం చేశారు.రూ.75 కోట్లతో  అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కొరకు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు అవసరమైతే రాత్రి, పగలు కూడ ఎక్కువ పనివారిని పెట్టి మార్చి మొదటి వారం కల్లా పెండింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఎస్పీ నరసింహ,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్,మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక, హౌసింగ్ పీడీ సిద్ధార్థ,పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,కోతి సంపత్ రెడ్డి,సులువ చందు, పులిచింతల వెంకటరెడ్డి, సుంకరి శివరాం,శివ,యోహాన్, తదితరులు,పాల్గొన్నారు.