17 July, 2026 | 6:33 AM

హైడ్రా బాధితులకు అండగా ఉంటాం

29-10-2024 03:10 AM
  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  2. పలువురికి పరామర్శ

కూకట్‌పల్లి, అక్టోబర్ 28: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో తమ ఇంటిని కూడా కూల్చేస్తారనే భయంతో గత నెల 27న కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఆమె కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉందన్నారు. ఎక్కడ నా ఇల్లు కూలగొడతారో అని బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమెది ఆత్యహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్‌రెడ్డి చేయించిన హత్య అని ఆరోపించారు.

పెద్దపెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర చందాలు వసూలు చేయడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు. 

శేరిలింగంపల్లి: హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీని, కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీకి పుస్తకాలతో పాటు బ్యాగులను అందించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.