8 April, 2026 | 1:58 PM

ఒకటో తారీఖు టెన్షన్!

29-10-2024 03:11 AM
  1. బల్దియా ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం ప్రతినెలా వెతుకులాట
  2. నవంబర్ వేతనాల కోసం ప్రాపర్టీ ట్యాక్స్ సిబ్బందికి రూ.100 కోట్ల టార్గెట్ 
  3. కొత్త కమిషనర్‌కు సవాల్‌గా మారిన వేతనాల సమస్య

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బల్దియాలో ఉద్యోగుల వేతనాలకు ప్రతినెలా నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల(అక్టోబర్)లో నూ వేతనాలు చెల్లించేందుకు నిధులు లేనందున 5వ తేదీ తర్వాత చెల్లించాల్సి వచ్చింది.

ఈ మొత్తాన్ని అప్పటి కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉద్యోగుల వేతనాల వరకూ సర్దుబాటు చేశారు. నవంబర్ నెలలోనూ ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బల్దియా వద్ద ప్రస్తుతానికి నిధులు లేవు.

ఇటీవలనే బాధ్యతలు తీసుకున్న కొత్త కమిషనర్ ఇలంబర్తి జీహెచ్‌ఎంసీ యంత్రాంగాన్ని సెట్ చేసే పనిలో ఉండగా, మరో రెండ్రోజుల్లో 1వ తేదీ రానుందనే విషయంతో బల్దియా ఉన్నతాధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

జీహెచ్ ఎంసీ వ్యాప్తంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలకు సరిపడా రూ.100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఈనెల 31లోగా వసూలు చేయాలని బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు టార్గెట్  విధించారు. 

రెండు నెలలుగా కటకట... 

ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధారణంగానే ప్రతినెలా 1వ తేదీ కంటే ముందుగానే వాళ్ల అకౌంట్‌లో వేతనాలు పడుతుంటాయి. కానీ, జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల పరిస్థితి కొన్నాళ్లుగా అందుకు భిన్నంగా ఉంది. సంస్థ ఖజానాలో నిధుల లేమితో ప్రతినెలా వేతనాలు  ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

అక్టోబర్ నెలలో దసరా పండుగ ఉన్నప్పటికీ.. 5వ తేదీ వరకు కూడా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వేతనాలు అందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులను గమనించిన అప్పటి కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యామ్నాయ పద్ధ్దతిలో వేతనాలను సర్దుబాటు చేయడంతో ఆ నెలలో మమా అనిపించారు.

మరో మూ డ్రోజుల్లో వేతనాలు సమయం నవంబరు 1వ తేదీ సమీపించడంతో బల్దియా అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయి. బల్దియా ఇప్పటికే వివిధ పథకాలలో భాగంగా తీసుకున్న రూ.6,500 కోట్ల రుణానికి అసలుతో కలిసి ప్రతినెలా రూ.100 కోట్లు చెల్లిస్తోంది. మొత్తం నిర్వాహణ ఖర్చులన్నీ కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లకు దాదాపు రూ.1,450 కోట్లు బకాయిలు ఉన్న సంగతి తెల్సిందే. 

మూడ్రోజులు.. రూ. 100 కోట్ల టార్గెట్ 

బల్దియాలో దాదాపు 30వేలకు పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వేతనాల కోసం ప్రతినెలా రూ.100 కోట్లు ఖర్చవుతుంది. బల్దియాకు వ చ్చే ఆదాయంలో ప్రాపర్టీ టాక్స్ రూ పంలో మాత్రమే పెద్ద మొత్తంలో ఉం టుంది. 2023 ఏడాదికి ప్రాపర్టీ ట్సాక్స్ రూ.1915 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది (2024 రూ. 2100 కోట్ల టార్గెట్‌ను విధించుకుంది.

ఇప్పటికే 2024 ఏడాది ఎర్లీ బర్డ్ కింద ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.860 కోట్లు వసూలైంది. ఇప్పటివరకు మొత్తం రూ. 1,260 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యింది. మొత్తం టార్గెట్ రూ.2,100 కోట్లలో ఇంకా  రూ.840 కోట్లు (మా ర్చి వరకు) వసూలు కావాల్సి ఉంది.

ప్రస్తుతం 1వ తారీఖు సమీపిస్తున్న నేపథ్యంలో వేతనాలు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేక మిగతా బ్యాలెన్స్ రూ.840 కోట్లలో రూ.100 కోట్లు వసూలు చేయాలని బల్దియా నిర్ణయించింది. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా ప్రాపర్టీ ట్యాక్స్ విభాగంలోని 340 బిల్ కలెక్టర్లు, 145 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు ట్యాక్స్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు.