04-02-2026 02:59:13 PM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల పరిధిలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ బీమా ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను సకాలంలో పూర్తి చేసి, ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్ నుండి భారత ప్రభుత్వ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లతో పీఎంజి పరిధిలోని అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, భూ సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ పాల్గొన్నారు. రాజీవ్ బీమా ప్రాజెక్టుకు మొత్తం 59.04 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 50.39 హెక్టార్ల భూ సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన 8.04 హెక్టార్ల భూ సేకరణను తక్షణమే పూర్తి చేసి, ప్రాజెక్టు నిర్మాణ పనులకు అందజేస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సచిన్, డిప్యూటీ కలెక్టర్ భూ సేకరణ అరుణ రెడ్డి, కలెక్టరేట్ భూ సేకరణ విభాగపు సూపరింటెండెంట్ సి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.