17 July, 2026 | 2:42 AM

సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

17-07-2026 02:42 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై16( విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెలరోజుల్లోపు అమలు చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు బద్రి సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగేశ్వరరావు నివాసంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైతులకు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లే తెలంగాణలోనూ రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆడ ప్రాజెక్టు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో అది ఆత్మహత్యల ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. వట్టివాగు కాలువల మరమ్మతులకు మూడు సంవత్సరాల క్రితమే రూ.150 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకత లేదని, కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

కొన్నిచోట్ల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటే ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.నెలరోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్, నాయకులు జాడె అశోక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.