మీటర్లు పెట్టం

12-09-2026 | 05:30am

వ్యవసాయ మోటార్లపై రైతులకు 100 శాతం హామీ ఇస్తున్న..

పగలు సోలార్, రాత్రి బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్‌తో విద్యుత్ 

ప్రతిపక్షాలు లేని భయాలు సృష్టించొద్దు

శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): వ్యవసాయ మోటార్లు(Agricultural motors), పంప్ సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు(Smart meters) పెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశా రు. ‘రాష్ట్ర రైతాంగానికి 100 శాతం హామీ ఇస్తున్నా,  భూమి, ఆకాశం ఏకమైనా, ఎవరైనా ఒత్తిడి తెచ్చినా నిర్ణయం మారబోదు’ అని హామీ ఇచ్చారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Desapathi Srinivas) అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానం ఇచ్చారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ ప్రతిపక్షాలు రైతుల్లో లేని భయా లు, అపోహలు సృష్టించి అయోమయానికి గురి చేయొద్దని కోరారు. వ్యవసాయ పంపుసెట్ల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా వెల్లడించింద ని, ఇందులో ఎలాంటి మార్పూ ఉండదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్డీఎస్‌ఎస్ (రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)(Revamped Distribution Sector Scheme)లో లేదని భట్టి విక్రమార్క వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కేంద్రంతో ఉదయ్ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ డిస్కంలు కలిసి ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిపారు. 2017 జూన్ 30 నాటికి 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీ) మీటరింగ్ పూర్తి చేయాలని, 2018 డిసెంబర్ 31 నాటికి రైతులు మినహా నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వినియోగదారులకు, 2019 డిసెంబర్ 31 నాటికి నెలకు 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నాటి ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఆ ఒప్పందంపై అప్పటి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, టీఎస్‌ఎస్‌పీడీఎస్‌ఎల్ అప్పటి సీఎండీ జి. రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ అప్పటి సీఎండీ  గోపాల్‌రావు సంతకాలు చేశారని వివరించారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 9వ తేదీన 19,543 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని తెలిపారు.

ఇంత భారీ డిమాండ్‌ను ప్రస్తుత వ్యవస్థతోనే తట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని భట్టి తెలిపారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2029-30 నాటికి రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 24,624 మెగావాట్లకు, 2034-35 నాటికి 34,137 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. 

రాత్రి సమయంలోనూ విద్యుత్ సరఫరా..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదయ్ త్రైపాక్షిక ఒప్పందంలో సంతకం చేసిన అంశాలకు మించి ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతులు బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ పంపుసెట్లను సోలరైజేషన్ చేయడం ద్వారా ఖర్చు తగ్గించడంతో పాటు రైతులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

భవిష్యత్తులో బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చి పగలు, రాత్రి సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సోలార్ పంప్‌సెట్ల ద్వారా పగటిపూట రైతులు వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను పంప్డ్ స్టోరేజ్ ద్వారా నిల్వ చేసుకుంటే రాత్రిపూట కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయవచ్చని భట్టి వివరించారు. వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతంలో రైతులు విద్యుత్ కోసం అర్ధనగ్నంగా నిరసన చేస్తున్నారంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. రైతుల పరిస్థితి నాకు కూడా తెలుసని, ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం కాదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల వ్యవసాయ పంపుట్లు ఉండగా, వాటికి  ఏటా రూ.14 వేల కోట్లు ఇంధన శాఖకు చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడానికి వర్షాభావ పరిస్థితులే కారణమని భట్టి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు