రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, మే 6,(విజయక్రాంతి)వేములవాడ నియోజకవర్గం పరిధిలోని పలు రైస్ మిల్లులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుతున్న వరి, మిల్లింగ్ ప్రక్రియ, తూకాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మిల్లర్లతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిల్లర్లు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. తూకాల్లో అవకతవకలు, ధాన్యం స్వీకరణలో ఆలస్యం, రైతులను వేధింపులకు గురిచేయడం వంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.






