అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు
జిల్లా కలెక్టర్ హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. శనివారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మట్, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుళ్ల మంగ, మున్సిపల్ చైర్మన్ మొంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు చేరవేస్తోందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24,209 మంది చేయూత పెన్షన్ దారులకు రూ.22.50 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల 36,179 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా 1.22 లక్షల మంది రైతులకు రూ.221 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
రైతు బీమా పథకం కింద మరణించిన 6,791 మంది రైతుల కుటుంబాలకు రూ.36.35 కోట్లు చెల్లించామని తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 6,957 మంది లబ్ధిదారులకు రూ.59.38 కోట్లు అందించామని చెప్పారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 5,029 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, అన్ని ఇళ్లు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు 39,223 కుటుంబాలకు అందించి రూ.6.27 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద 29,161 కుటుంబాలకు రూ.24.62 కోట్లు సబ్సిడీగా జమ చేసినట్లు చెప్పారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో 503 పాఠశాలల్లో రూ.163 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, స్కూల్ కిట్లు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండవ విడతలో ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మార్చి 6 నుండి జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం, ఫైళ్ల క్లియరెన్స్, రహదారి భద్రత, సంక్షేమ వారం, డ్రగ్స్ నివారణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నెల 4 నుండి 9 వరకు రైతు వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా మే 10 వరకు ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు మంజూరు చేసి మారుమూల గ్రామాలకు త్రాగునీరు, రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.






