27 July, 2026 | 10:11 PM

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలి

27-07-2026 09:33 PM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముత్తారం మండల అధ్యక్షుడు బండారి సుధాకర్

ముత్తారం,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముత్తారం మండల అధ్యక్షుడు బండారి సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మంథని డివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ముత్తారం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

ప్రత్యేకంగా ఉద్యమకారుల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని, నిరుద్యోగులుగా ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల పిల్లలకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. కేకే కమిటీ వేయడం హర్షణీయమన్నారు. కానీ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

అలాగే ఉద్యమకారులను గుర్తించి, ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు మద్దతుగా నిలవాలని కోరారు.  ఈ సమావేశంలో జిల్లా నాయకులు గోపగోని తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శంకర్, జిల్లా నాయకులు మల్లేష్, నిమ్మతి ఆశాలు, మండల నాయకులు అత్తె చంద్రమౌళి, ఉద్యమకారులు కలవేల బాలమల్లు, మల్యాల రాజయ్య, బిక్కినేని సుధాకర్ రావు, శేరు స్వామి, తీర్థాల కొమురెల్లి తదితరులున్నారు.