1 March, 2026 | 5:28 AM

పశ్చిమాసియా ఉద్రిక్తం!

01-03-2026 12:00 AM

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు చేయడంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. చర్చలు జరిగినప్పటికీ ఇరాన్‌పై దాడులు చేస్తామని అమెరికా ముందు నుంచే పేర్కొంటూ వచ్చింది. దీనికి తగ్గట్లే జలాంతర్గాములను ఇరాన్‌కు సమీపంలోకి తీసుకురావడం, సైన్యాన్ని మోహరించడంతో ఏ క్షణంలోనై దాడికి దిగుతామనే సంకేతాలను నిజం చేసింది.

ఈ నేపథ్యంలోనే అమెరికా తన మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి శనివారం ఇరాన్‌పై సంయుక్త సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. తాము చెబుతున్నా వినకుండా ఇరాన్ అణు కేంద్రాల పునర్నిర్మాణం, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ప్రపంచ అస్థిరతకు ముప్పు ఉన్నందునే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు తెలిపారు.

గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా ‘మిడ్‌నైట్ హామర్’ ఆపరేషన్ కింద బీ-2 బాంబర్‌ను ప్రయోగించి ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలను పూర్తిగా నాశనం చేసినట్లు అమెరికా ప్రకటించుకుంది. ఇరాన్ ఇకపై అణ్వాయుధ చర్యలు చేపట్టలేదని తెలిపింది. కానీ సమీప భవిష్యత్తులో అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం అందిందని ట్రంప్ గత మంగళవారం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో పేర్కొన్నారు.

అంతేకాదు అణ్వాయుధాలను పునర్నిర్మించడానికి భవిష్యత్తులో ఎటువంటి ప్రయ త్నాలు చేయొద్దని హెచ్చరించినప్పటికీ, తమ మాటను పెడచెవిన పెట్టి మళ్లీ అణుశుద్ధి కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఇరాన్‌పై తక్షణ దాడుల వెనుక మరో ముఖ్య కారణం నాయకత్వ మార్పు. కొంతకాలంగా ఇరాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, యూరోపియన్ కూటమి కఠిన ఆంక్షలు, ఖమేనీ నియంతృత్వ పోకడ ప్రజల్లో ఆందోళనను ఉధృతం చేసింది.

దేశంలో జరుగుతున్న హింసను అణచివేయడానికి స్వయంగా రంగంలోకి దిగిన ఖమేనీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తామని పేర్కొనడం ప్రజల్లో ఆగ్రహాజ్వాలలు రేకెత్తించాయి. ఖమేనీ స్థానంలో రాజు రెజా పహ్లవి షా ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టాలని, ప్రభుత్వం దిగిపోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోస్తే దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ దిశను చూపేందుకు సిద్ధమని ప్రకటించిన పహ్లావి అమెరికా నుంచే ఇరాన్‌లో జరుగుతున్న ప్రజాందోళనకు మద్దతిస్తూ వచ్చారు.

అయితే ఇరాన్ తన క్షిపణులతో పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాకు ఏకైక మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసేస్తే ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదముందని అమెరికా భావిస్తోంది. పైగా అణు కార్యక్రమాన్ని ఇరాన్ వేగవంతం చేసినట్లు వార్తలు రావడం కూడా ఆ దేశంపై తక్షణ దాడులకు కారణమని చెప్పొచ్చు.

మరోవైపు ఇరాన్ కూడా దాడుల విషయంలో వెనక్కి తగ్గమని పేర్కొంటూ అమెరికా, ఇజ్రాయెల్ బేస్‌లపై ఏకకాలంలో క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని అమెరికాను ఇప్పటికే హెచ్చ రించింది. ఇరాన్‌పై దాడిని రష్యా ఖండించగా.. శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పేర్కొంది. ఈసారి యుద్ధం ఎక్కువరోజులు ఉంటుందని అమెరికా ముందే ప్రకటించడం ఇరువైపులా నష్టం భారీగా ఉండనుంది!