దివ్యాంగుల హక్కులు కాపాడాలి!
దివ్యాంగులకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం కల్పించినప్పుడే నిజమైన సమాజ వికాసం సాధ్యమవుతుంది. దివ్యాంగుల జీవితాలు ఇప్పటికీ అనేక అడ్డంకులు, వివక్షలు, అవమానాలతో నిండిపోయి ఉన్నాయి. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులను దయార్హులుగా కాకుండా సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించినప్పటికీ, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు విషయమై స్పష్టమైన లోపాలున్నాయి.
దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, ఫైళ్లను పక్కనపెట్టడం, పదేపదే కార్యాలయాలకు తిరగమంటూ మానసిక వేధింపులకు గురిచేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, బదిలీల్లో వివక్ష చూపడం కూడా చట్టానికి వ్యతిరేకమే. దివ్యాంగుల భూముల ఆక్రమణలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యాల లేమి, ఉద్యోగావకాశాల కొరత, పెన్షన్ల మంజూరులో ఆలస్యం, వైద్య పరికరాల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి వంటివి దివ్యాంగుల ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక దివ్యాంగ హక్కుల పరిరక్షణ సెల్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి సౌకర్యాలపై కఠిన పర్యవేక్షణ జరపాలి. ఫిర్యాదులపై 30 రోజుల్లో పరిష్కార విధానం చూపించాలి. భూమి ఆక్రమణ కేసుల్లో వేగవంతమైన న్యాయ ప్రక్రియ జరిగేలా చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలి.
ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ, న్యాయ వ్యవస్థ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. చట్టాలు ఉండటం గర్వకారణమే కానీ అవి బాధితుల జీవితాల్లో మార్పు తీసుకురాకపోతే ఉన్నా ఉపయోగముండదు. దివ్యాంగులను సహాయం కోరే వ్యక్తులుగా కాకుండా హక్కులు డిమాండ్ చేసే పౌరులుగా గుర్తించినప్పుడే నిజమైన సమానత్వం సాకారం అవుతుంది.
మొహమ్మద్ మున్నా, నిజామాబాద్




