17 March, 2026 | 9:19 PM

మేడ్చల్ పట్టణ ప్రజలు ఏం పాపం చేశారు?

17-03-2026 12:00 AM

మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్

మేడ్చల్ అర్బన్ మార్చి 16 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ పట్టణంలో ప్రజలు ఏం పాపం చేశారని త్రాగునీటి సరఫరా అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ లీకేజీలపై అధికారులు పట్టించుకోక పోవడం ఏమిటని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం మేడ్చల్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహిళలతో ఖాళీ బిందెలతో ర్యాలీ నిరసన వ్యక్తం చేస్తూ డిప్యూటీ కమిషనర్ కాళ్లు మొక్కి నీటి సరఫరాపై దృష్టి సారించాలని  విన్నవించిన పట్టించుకోక పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా జలమండలి కమిషనర్ అశోక్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి లెటర్ ప్యాడ్ పై వినతిపత్రం సమర్పించిన మూడు రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి పట్టించుకోక పోవడం పై భాస్కర్ యాదవ్ మండిపడ్డారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా,హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క మంత్రి లేకపోవడం పై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.మేడ్చల్ కార్పొరేషన్ పరిధిలోని 247,298 ప్రాంతాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని భాస్కర్ యాదవ్ ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలపై దృష్టి సారించి త్రాగునీటి సమస్యతో పాటు అండర్ డ్రైనేజీ పైప్ లైన్ లీకేజీలను మరమ్మత్తులు చేసి ప్రజలకు అండగా నిలవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద యాదవ్.మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి.పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణు చారి తదితరులు పాల్గొన్నారు.