సన్నాలకు బోనస్ ఎప్పుడు?
- కొనుగోళ్లు పూర్తయినా ప్రారంభం కాని బోనస్ చెల్లింపులు..
- ఖరీఫ్‌లో 36,278 మెట్రిక్ టన్నులు.. 9733 మంది రైతులు..
- రూ.18.14 కోట్లు బకాయిలు
- గత యాసంగిలో 62,747 మెట్రిక్ టన్నులు 14,994 మంది రైతులు..
- రావాల్సింది రూ.31.37 కోట్లు
- మెదక్ జిల్లాలో రూ.49.54 కోట్ల బకాయిలు
మెదక్, జూన్ 28 (విజయ క్రాంతి) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ నిల బెట్టుకోవడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్లో మెదక్ జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. దీంతో సీజన్ ముందే వరిసాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రచారం నిర్వహించడంతో జిల్లాలోని రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపారు.
అయితే సీజన్ ముగిసి దాదాపు మూడు నెలలైన బోనస్ డబ్బులు పూర్తిస్థాయిలో జమకాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో సన్నరకాన్ని ప్రోత్సహించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాల్సి ఉంది.
యాసంగిలో సన్నరకం సాగు..
జిల్లాలో యాసంగి సీజన్ లో 3 లక్షల పై చిలుకు ఎకరాల్లో వరి సాగు చేయగా ఇందులో 62742 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కూడ ఉంది. జిల్లా వ్యాప్తంగా 340 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 14,994 మంది రైతుల నుంచి 62,747 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.500 బోనస్ చొప్పున రూ.31.37 కోట్లను సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
అయితే జిల్లాలో యాసంగి కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ డబ్బులు మాత్రం జమ చేయలేదు. సన్నరకం అమ్మి న రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయి న తరువాత బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిం చడంతో ఎప్పుడు జమ చేస్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు.
గత యాసంగి... ఇప్పటి ఖరీఫ్ బోనస్ పెండింగ్..
సన్నరకం ధాన్యం మీద ప్రభుత్వ ప్రకటించిన క్విం టాకు రూ.500 బోనస్ సకాలంలో అందితే వానాకాలం సాగుకు అందుతాయనే భావనలో రైతులు ఉన్నారు. జిల్లాలో వానాకాలం సాగు పనులు ప్రారంభమైనప్పటికీ బోనస్ డబ్బులు చేతికి అందకపోవడం తో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 2024- 25 యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకూ 3,19,144 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి..80,873 మంది రైతుల ఖాతాల్లో రూ. 740.42 కోట్లు జమ చేయడం జరిగింది.
వానాకాలం సాగు కోసం రైతులు ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేయను న్నారు. ట్రాక్టర్ కిరాయిలు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులతో సాగు పూర్తయ్యే సరికి అంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. అయితే యాసంగి సీజన్ కు సంబంధించిన సన్నరకం బోనస్ డబ్బులు ఈలోగా రైతుల ఖాతాల్లో జమ అయితే వానాకాలం సీజన్కు ఉపయోగపడేవి.
ప్రభుత్వం సకాలంలో స్పం దిస్తే సాగు ఖర్చుల్లో కొంతమేరకైన రైతులకు ఉపశమనం ల భించేది. ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ డబ్బులపై ప్రకటన చేయకపోవడంతో ఎప్పుడు అందుతాయో తెలి యని పరిస్థితులు ఉన్నాయి.
బోనస్ డబ్బులు రాగానే జమ చేస్తాం..
మెదక్ జిల్లాకు సన్నాల బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. గత యాసంగి లో 62,747 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 14,994 మంది రైతులకు గాను రూ.31.37 కోట్లు పెండింగ్ లో ఉంది. అంతే కాకుండా ఇప్పటి ఖరీఫ్ లో 36,278 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యానికి 9733 మంది రైతులకు గాను రూ.18.14 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది.
జగదీష్ కుమార్, సివిల్ సప్లయ్ డిఎం






