29 June, 2026 | 2:01 AM

ప్రైవేటు నుంచి..సర్కార్ వైపునకు..

29-06-2026 12:00 AM
  1. ప్రభుత్వ పాఠశాలలో 145 మంది విద్యార్థుల చేరిక..
  2. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా భోధన పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు

తాడ్వాయి, జూన్, 28 (విజయ క్రాంతి ): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉండవు, అక్కడ విద్యాబోధన సరిగ్గా విద్యార్థులకు అందదు, అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోరు, అన్న లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత కష్టమైనా ఎన్ని బాధలైనా ఓర్చుకొని తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల కు పంపుతున్నారు.కానీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఈ సంవత్సరం దీనికి భిన్నంగా జరిగింది.ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 145 మంది విద్యార్థులు కొత్తగా చేరడంతో అందరూ కన్కల్ పాఠశాల వైపు కన్నేసి చూస్తున్నారు.

మాకు ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు...అన్న రీతిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ణయం తీసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా వివిధ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 145 మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గ్రామస్తులంతా ఏకమై ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచారు. గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి ప్రత్యేక కృషితో పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు.ఏకంగా గతంలో 108 మంది ఉండగా ఈ ఏడాది 253 కు చేరుకుంది.

తల్లిదండ్రులకు భారం తగ్గించడానికే.. 

విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గించడం కోసమే గ్రామస్తులంతా ఏకమై 15 మందితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.ఆ కమిటీ సభ్యులు నిరంతరం పాఠశాలలో వసతులపై, విద్యాబోధనపై పర్యవేక్షిస్తూ మెరుగైన విద్యను అందించడానికి తోడ్పాటును అందిస్తున్నారు.గ్రామస్తుల కృషికి సర్పంచ్ పట్టుదలకి మిగతా గ్రామాల వారు అభినందిస్తున్నారు.

భారమవుతున్న  ప్రైవేటు బడులు..

ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు రోజురోజుకు భారమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎలాంటి నిబంధనలు లేకుండానే ఇష్టారీతిగా ఫీజులు పెంచుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సందర్భంలో కన్కల్ గ్రామ పెద్దలు, యువకులు కలిసికట్టుగా ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు.. ప్రభుత్వ పాఠశాల ఉండగా.. అనే నినాదంతో ముందుకు వచ్చి ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న విద్యార్థులను అక్కడి నుంచి మళ్లించి  ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దడమే లక్యం 

మా గ్రామ ప్రభుత్వ పాఠశాల ను అన్ని సౌకర్యాలతో తీర్చి దిద్దడమే లక్ష్యం గా పెట్టుకొని కృషి చేస్తున్నా. గ్రామస్థుల సహాకారం తో ఆదర్శ పాఠశాల గా మార్చడానికి సంకల్పం పెట్టుకొని పని చేస్తున్నాను.నా లక్ష్యం నెరవేరే వరకు కృషి చేస్తాను.

- మైలారం రవీందర్ రెడ్డి, సర్పంచ్, కన్కల్