ఉద్యోగుల సమస్యలు తీరేదెన్నడు?

12-09-2026 | 05:10am

పల్లె నాగరాజు :

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana Government Employees Joint Action Committee) (టీజీఈజేఏసీ) ప్రకటించిన ధర్నా, ఆందోళన కార్య క్రమాల(protest activities)ను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడం సాధారణ ఉద్యోగుల(ordinary employees)ను తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేసింది. తమ సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రభుత్వం దిగివస్తుందని వేల సంఖ్యలో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఎ లాంటి స్పష్టమైన హామీలు లేకుండా పో రాటాలను పదే పదే వాయిదా వేయడం ఉద్యోగ వర్గాలను తీవ్రంగా మోసం చేయడమే అవుతుంది. ఉద్యమానికి పిలుపుని చ్చినప్పుడు ఉద్యోగులు తమ విధులను పక్కనపెట్టి, తమ సమస్యల పరిష్కారం కో సం పోరాటానికి సిద్ధమవుతారు. అలాంటి సమయంలో చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేయడం వారి నమ్మ కాన్ని దెబ్బతీస్తున్నది.

పే రివిజన్ కమిషన్(Pay Revision Commission) (పీఆర్సీ) నివేదిక అమల్లో ఆలస్యం, పేరుకుపోయిన కరువు భత్యం బకాయిలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ వంటి అనేక ప్ర ధాన సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇవి ఒక్కరోజులో పుట్టుకొచ్చి న సమస్యలు కావు. చాలాకాలంగా ఉద్యోగులు తమ హక్కులుగా భావిస్తున్న అంశా లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నా రు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నది.

ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక కుటుంబాన్ని పోషించడం ఉద్యోగులకు భారంగా మారుతోంది. జీతభత్యాలకు సంబంధించిన అంశాలు ఉద్యో గుల జీవన ప్రమాణాలతో నేరుగా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్య లపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బలమైన పోరాట వేదికగా నిలవాల్సిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన కార్యక్రమాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడం ఉద్యోగుల డి మాండ్లను తొక్కిపెట్టడమే అవుతుంది.

గతంలో కూడా ఈ తరహా వాయిదా నిర్ణయాలు ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ ఏడాది మే నెలలో మధ్యాహ్న భోజన సమయంలో చేపట్టాల్సిన నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందనే నెపంతో వాయిదా వేశారు. తాజాగా జరగాల్సిన ‘చలో హైదరాబాద్’ పిలుపును కూడా ప్రభుత్వం కేవలం చర్చలకు సమ యం ఇస్తామన్న రాతపూర్వక ప్రతిపాదనల సాకుతో చివరి నిమిషంలో తాత్కాలి కంగా పక్కన పెట్టారు. ప్రతిసారీ తీవ్రస్థా యి ఆందోళనలకు పిలుపునివ్వడం, ఆపై ప్రభుత్వ కాలయాపన కమిటీల హామీలతో ఉద్యమాలను నిలిపివేయడం పరిపాటిగా మారుతోంది.

చర్చలకు అవకాశం ఇవ్వ డం తప్పు కాదు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభు త్వం ముందుకు రావడం కూడా స్వాగతించాల్సిన అంశమే. కానీ, చర్చలు కేవలం ఆందోళనలను నిలిపివేయడానికి పరిమితమైతే, సమస్యలు మాత్రం అలాగే మిగిలి పోతే ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటన్నదే ప్రశ్న.

ప్రభుత్వంతో చర్చల పేరుతో ఉద్యమ తీవ్రతను తగ్గించడం, కంటితుడుపు చర్య గా వాయిదాల పర్వం కొనసాగించడం వల్ల ప్రభుత్వానికి కాలయాపన చేసే అవకాశం లభిస్తుంది. ముందస్తు ప్రణాళికతో ధర్నాకు సిద్ధమైన వేలాది మంది ఉద్యోగులకు ఇది స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది. నాయకత్వం ఉద్యోగుల సంక్షేమం కంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు లేదా రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆందోళనలకు పిలుపునివ్వడం, ఆపై చర్చల సాకుతో వెనక్కి తగ్గడం వల్ల ఉద్యమ స్ఫూర్తి దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తులో పిలుపు నిచ్చే ఏ పోరాటంపై అయినా ఉద్యోగులకు విశ్వాసం సడలిపోతుంది. ఒకసారి ఉద్యోగుల్లో ఉద్యమ నాయకత్వంపై నమ్మకం తగ్గితే వారిని మళ్లీ ఒకే వేదికపైకి తీసుకురావడం అంత సులభం కాదు. అందువల్ల ప్రతి నిర్ణయం ఉద్యోగుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నాయకత్వం తీసుకునే ఇటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో పనిచే స్తున్న ఉపాధ్యాయులు, క్లర్క్‌లు, నాలుగవ తరగతి సిబ్బంది, ఇతర ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. హక్కుల సాధన కోసం నమ్మిన నాయకులే తమను ఐక్యంగా నిలబెట్టడంలో విఫ లమవుతున్నారని వారు భావిస్తున్నారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నాయకత్వంపై ఆధారపడుతారు.

ఆ నాయకత్వమే పదే పదే వెనక్కి తగ్గితే వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వాయిదా నిర్ణయం వల్ల లబ్ధి పొందేది ప్రభుత్వమే తప్ప, ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు కాదు. ఉద్యమానికి పిలుపునిచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉద్యోగులు చేసే ఏర్పాట్లు, పెట్టుకునే ఆశలు, ఎదురుచూసే పరిష్కారాలు అన్నీ ఒక్క నిర్ణయం తో నీరుగారిపోతాయి. ఇది సాధారణ ఉద్యోగుల్లో అసంతృప్తిని మరింత పెంచుతుంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యలను వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి మాత్రం మారడం లేదనడానికి ఈ ధర్నా వాయిదానే ఉదాహరణ గా కనిపిస్తోంది. సమస్యలను పరిష్కరించడానికి కాలయాపన చేస్తూ కమిటీల మీద కమిటీలు వేయడం, ఆపై ఉద్యోగ సంఘా లు కూడా ఆ సాకులు చూపుతూ వెనకడు గు వేయడం వల్ల సగటు ఉద్యోగి తీవ్ర న ష్టానికి గురవుతున్నాడు. సమస్యలను పరిశీలించేందుకు కమిటీలు వేయడం ఒక ప్రక్రియ కావచ్చు. కానీ ఆ ప్రక్రియకు అం తం లేకుండా పోతే ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది ప్రశ్న. 

గతంలో సాధించుకున్న హక్కులను కూడా నిలబెట్టుకోలేని స్థితిలోకి ఉద్యోగ లోకాన్ని నెట్టివేయడం నాయకత్వ వైఫల్యాన్నే ఎత్తిచూపుతోంది. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాల్సిన జేఏసీ, కేవలం ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగులపై రుద్దే వేదికగా మారడం శోచనీయం. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే కాదు, వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించడమూ ఉద్యోగ సంఘా ల ప్రధాన బాధ్యత.

తమ సమస్యలు పరిష్కారమవుతాయ న్న నమ్మకంతోనే ఉద్యోగులు జేఏసీ పిలుపులకు స్పందిస్తారు. ఆ నమ్మకమే ఏ ఉద్యోగ ఉద్యమానికైనా ప్రధాన బలం. ఆ బలాన్ని నాయకత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పిలుపునిచ్చిన తర్వాత వెనక్కి తగ్గే పరిస్థితులు పునరావృతమైతే, తదుపరి కార్యక్రమాలకు ఉద్యో గుల నుంచి అదే స్థాయిలో స్పందన రావ డం కష్టమవుతుంది. 

ఉద్యోగ సంఘాల మనుగడ ఉద్యోగుల ఐక్యత, వారి పట్ల ఉన్న బాధ్యతపైనే ఆధారపడి ఉంటుంది. వాయిదాల పేరుతో పోరాటాలను మరుగున పడేయడం వల్ల నాయకత్వం విశ్వసనీయత కోల్పోతుంది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల్లో పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించాలి. కాలయాపన వ్యూహాలకు తావివ్వకుండా, నిర్దిష్ట సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించాలి.

ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాడాల్సిన సమయంలో పదే పదే వాయిదాలు వేయడం సమస్యలను పరిష్కరించదు. పైగా ఉద్యమ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత బలహీనపరుస్తుంది. అందువల్ల ఇకనైనా వాయిదాల పర్వానికి ముగింపు పలికి, ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకుసాగాలి. డిమాండ్లను సాధించే వరకు వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని ముందుకు తీసుకె ళ్లాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది.

 వ్యాసకర్త: ప్రభుత్వ 

ఉపాధ్యాయుడు, 8500431793

మరిన్ని వార్తలు