15 April, 2026 | 7:32 AM

పంచాయతీరాజ్ పటిష్టమెప్పుడు?

27-12-2025 12:00 AM

జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయపడినట్లు భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తున్నది. కాబట్టి గ్రామ స్వరాజ్యం నెలకొనాలంటే అట్టడుగు స్థాయిలోని ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రజ లు భాగస్వామ్యం తప్పనిసరి. మన దేశం లో ప్రాచీన కాలం నుంచే గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్నదని చెప్పవచ్చు. కౌటిల్యుని అర్థ శాస్త్రంలో గ్రామాధికారుల గురించి, మెగస్తనీస్ ఇండికాలో పాటలీపుత్ర నగర పాల న గురించి పేర్కొన్నారు. చోళులు స్థానిక స్వపరిపాలనకు పెద్దపీట వేశారు. బ్రిటిష్ వలస పాలన కాలంలో రిప్పన్ స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేశాడు.

అనంతరం భారత ప్రభుత్వం కూడా స్థాని క ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాంగం లో నిబంధన 40 ప్రకారం గ్రామ పంచాయితీల ఏర్పాటుకు అవకాశం కల్పించిం ది. గ్రామీణాభివృద్ధి ద్వారానే భారతదేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశ్యం తో 1952లో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాన్ని, 1953లో జాతీయ విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించి వాటి అమలు తీరును పరిశీలించి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించిన సూచనలు చేయడానికిగాను బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కమిటి సిఫార్సుల మేరకు దేశంలో మూ డంచెల పంచాయతీరాజ్ (పీఆర్) వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. అనంతరం జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీ ని ఏర్పాటుచేసి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు గల మరిన్ని సూచనలను తీసుకోవ డం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలో అనేక కమిటీలను, కమిషన్లను వేసి పంచాయతీరాజ్ వ్యవస్థలోని లోపాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసింది. చివరకు 1993లో 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధతను కల్పించడం జరిగింది.

సమాంతర సంస్థల ఏర్పాటు..

పంచాయతీరాజ్ వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రతీక. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల వల్ల, ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పాటు చేయబడ్డ స్థానిక ప్రభుత్వాలు ప్రజా చైతన్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే వాస్తవంలో మాత్రం పం చాయతీరాజ్ వ్యవస్థలోని వివిధ స్థాయిలకు సమాంతరంగా మరికొన్ని సంస్థలు కొనసాగడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థల లక్ష్యాలు హరించి వేయబడుతున్నా యనే విమర్శలున్నాయి.

ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నికైన స్థానిక ప్రభుత్వాలు చేసే పనులను ఈ సమాంతర వ్యవస్థలు చేయడం వల్ల వాటి మధ్య అధికారం, నిధులు, ఆధిపత్యం వంటి అనేక అంశాల్లో ఘర్షణ నెలకొని స్థానిక ప్రాంత అభివృద్ధికి విఘాతం కలిగే ప్రమాదముందని స్థానిక ప్రతినిధులు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మన దేశంలో 73వ రాజ్యాంగ సవరణ రావడానికి ముం దు నుంచే కొన్ని సమాంతర సంస్థలు కొనసాగుతూ వస్తున్నాయి. ఉమ్మడి అటవీ యాజమాన్య సంస్థ, నీటి వినియోగదారుల సంస్థ దీనికి ఉదాహరణలు.

అయితే ఈ సవరణ అనంతరం అనేక రాష్ట్రాల్లో విభిన్న రకాల సమాంతర సంస్థలు ఏర్పా టు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పంచాయతీలకు 29 అంశాలను నిర్ధారించడం జరిగింది. మన రాష్ర్టంలో పంచాయితీరాజ్ వ్యవస్థ సామాన్య ప్రజ లు రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతున్నది.మహిళలు, షెడ్యూ ల్డ్ కులాల, తెగలు, వెనుకబడిన తరగతులకు చట్టబద్ధంగా రాజకీయ ప్రవేశాన్ని కల్పించినందువల్ల ఈ వర్గాల సమస్యలు చాలా వరకు పరిష్కరించబడుతున్నాయి.

జవాబుదారీతనం!

రాష్ర్టంలో మొదట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఒకే గొడుగు కింద ఉండడంతో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు చేసేది. వివిధ కారణాలతో గ్రామీణాభివృద్ధి విభాగాన్ని పంచాయతీరాజ్ నుంచి వేరుచేసి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా పంచాయతీరాజ్ వ్యవస్థ రాజకీయ అలంకరణగా మిగిలిపోయింది. నిధులు లేకపో వడంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడుతున్నాయి.

గ్రామీణ పేదరిక నిర్మూల న లక్ష్యంగా రూపొందించిన ఇందిరా క్రాం తి పథకం, సాంఘీక భద్రతను చేకూర్చే పెన్షన్లు వంటివి పంచాయతీరాజ్ పరిధిలో లేకపోవడం శోచనీయం. ఎంపీల్యా డ్స్ వంటి పథకాలు కూడా జిల్లా కలెక్టర్ పరిధిలోనే ఉండడం వంటి అనేక అంశాలను పరిశీలిస్తే జిల్లా స్థాయిలోనే పం చాయతీరాజ్ పాలనను అభివృద్ధి కార్యక్రమాలను వేరుచేసినట్లు కనిపిస్తున్నది.

ఇక ప్రభుత్వం మండల స్థాయిలో ఒక రాజకీ య వ్యవస్థను, ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమే అయినప్పటికీ ఇదే స్థాయిలో సమాంతరంగా మరికొన్ని సంస్థలను కూడా ఏర్పా టు చేయడం వల్ల మండల పరిషత్ అధికారాలు కూడా తగ్గిపోయాయి. ఉదా హరణకు ఇందిరా క్రాంతి పథకం అమలు కు గాను మండల స్థాయిలో మండల కో-ఆర్డినేటర్ నియామకం, మండల సమాఖ్య లు, మహిళా సమాఖ్యలు, వికలాంగుల సమాఖ్యల ఏర్పాటు వంటివి పంచాయితీరాజ్ వ్యవస్థ పరిధిలో లేవు.

జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ కార్యక్రమాలను మండ ల, గ్రామ స్థాయిలో అమలు చేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఏర్పాటు చేసిన యంత్రాంగం ఉండటం, ప్రభుత్వ ధనానికి ఎవరు జవాబుదారీగా ఉన్నారనేది చెప్పాలని స్థానిక ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల స్థానిక సంస్థలు.. ప్రభుత్వ ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగడం మరో సమస్య.

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తప్పనిసరిగా జరగాలి. ఈ నిబంధన కు విరుద్ధంగా ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తుండటం వల్ల ప్రజాస్వా మ్య వికేంద్రికరణపై విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులు లేకపోవడం వల్ల స్థానిక సంస్థలు బలహీనపడుతున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడం, అధికారులు పని ఒత్తిడి వల్ల గ్రామాల్లో  సమస్యలు పరిష్కరించలేకపోతున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. 

బలోపేతం అవసరం!

పంచాయితీరాజ్‌కు సమాంతరంగా ఉన్న సంస్థలు నిజానికి మొత్తం ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు. సాగునీటి సం ఘాలు కేవలం సాగునీటి సమస్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. అదేవిధంగా స్వయం సహాయక బృందా లు మహిళలకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తాయి. మరికొన్ని సంస్థలు కొంతకాలం మాత్రమే కొనసాగడం, ప్రభుత్వా లు మారినప్పుడల్లా సంస్థలు మారడం, పర్యవేక్షణలోపంతో జవాబుదారీతనం, నిధుల కొరత వంటి కారణాల వల్ల ఈ సమాంతర సంస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రత్యామ్నయం అని ఖచ్చితంగా చెప్పలేం.

అందువల్ల ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో సమాంతర సంస్థలకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. పంచాయతీ రాజ్ భావన ఒక మహెన్నత ఆశయ సాధనకు ఉద్దేశించింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కనపడుతుంది.

అయితే పంచాయతీరాజ్ వ్యవస్థలోని లోపాలను సంస్కరించి నూత న విధానాలను ప్రవేశపెట్టి ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీనికి ఇతర సంస్థల సహకారం తీసుకుంటూనే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయకుండా తగిన జాగ్ర త్తలు తీసుకోవాలి. ప్రభుత్వం, ప్రజాసంఘాలు, ప్రజలంతా కలిసి గ్రామీణాభి వృద్ధిలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.